Madhya Pradesh : మధ్యప్రదేశ్ లోని ఓ పోలీస్ స్టేషన్లో ఓ జర్నలిస్ట్, యూట్యూబర్ బట్టలు ఊడదీసినట్లు సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది. ఓ బీజేపీ రాజకీయ నాయకుడిపై స్టోరీ కారణంగా తనను టార్గెట్ చేశారని ఆ జర్నలిస్టు ఆరోపించారు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఒక పోలీసు స్టేషన్‌లో పలువురు అర్థనగ్నంగా నిలబడి ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫోటోలో ఎనిమిది మంది పురుషులు అర్థ నగ్నంగా నిలబడి ఉన్నారు. వారిలో స్థానిక యూట్యూబ్ జర్నలిస్ట్ కనిష్క్ తివారీ కూడా కనిపించారు. ప్రస్తుత నివేదికల ప్రకారం.. కనిష్క్ తివారీ, మరికొందరు నీరజ్ కుందర్ గురించి విచారించడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు వారు అరెస్టు చేయబడ్డారు. నీరజ్ కుందర్ ఒక థియేటర్ ఆర్టిస్ట్.. ఆయన BJP శాసనసభ్యుడు మరియు అతని కుమారుడిపై అనుచిత పదజాలం ఉపయోగించారనే ఆరోపణలపై అరెస్టయ్యారు.
కుందర్ అరెస్ట్‌ను నిరసించినందుకు ఈ వ్యక్తుల బృందాన్ని అరెస్టు చేసినట్లు సమాచారం. నిరసన సందర్భంగా వారు రోడ్డుపై కూర్చొని ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించారని పోలీసు అధికారి తెలిపారు. తివారీ మరియు ఇతర వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత జర్నలిస్టుతో పాటు మరో ఎనిమిది మంది పోలీసు స్టేషన్ లో అర్థనగ్నంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారు తమ లోదుస్తుల వరకు తీసివేసినట్లు కనిపించే ఫొటోల్లో కనిపిస్తోంది. సిద్ధికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లా నమోదు ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేసిన నీరజ్ కుందర్ అరెస్టుకు వ్యతిరేకంగా తాను ఇతరులతో కలిసి నిరసన తెలుపుతున్నట్లు తివారీ తెలిపారు. జర్నలిస్ట్ ప్రకారం, అతని కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు, కుందర్ అరెస్ట్ గురించి విచారించడానికి అతను పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు.
అయితే, పాత్రికేయ కారణాల వల్ల తాను అక్కడ ఉన్నప్పటికీ, పోలీసులు తనను అరెస్టు చేసి సుమారు 18 గంటలపాటు స్టేషన్ లో ఉంచారనీ, దారుణంగా కొట్టారని తివారి వెల్లడించారు. "నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాను మరియు ఇటీవల నేను కేదార్‌నాథ్ శుక్లాకు సంబంధించి పలు విషయాలు గురించి ఓ రిపోర్టు ప్రచురించాను. ఆ వార్తల కారణంగా నన్ను లక్ష్యంగా చేసుకున్నారు" అని జర్నలిస్ట్ చెప్పారు. సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోలలో తివారీ, ఇతరులతో కలిసి పోలీస్ స్టేషన్ వెలుపల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే షుకా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తున్నది.
సిద్ధి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖేష్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే, అతని కుటుంబాన్ని పరువు తీయడానికి సంబంధించిన కేసులో కొత్వాలి పోలీసులు ఏప్రిల్ 2న థియేటర్ ఆర్టిస్ట్ నీరజ్ కుందర్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. “ఒక బీజేపీ ఎమ్మెల్యే మార్చి 16న కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విచారణలో పోలీసులు ఫేస్‌బుక్ నుండి పోస్ట్‌లు, ఐసీ అడ్రస్‌పై వివరాలను సేకరించగా.. నీరజ్ కుందర్‌తో సంబంధాలున్నట్లు గుర్తించిన తర్వాత అతడిని అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే, అరెస్టును వ్యతిరేకిస్తూ, దాదాపు 40 మంది.. కుందర్ బంధువులు మరియు స్నేహితులు, యూట్యూబర్ సాయంత్రం పోలీసు స్టేషన్‌ను ఘెరావ్ చేసి నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంలోనే వారిని ముందస్తు నిర్బంధంలో ఉంచారు. అయితే వారి బట్టలు ఎందుకు విప్పారు, ఎవరు చేశారనే దానిపై విచారణ జరుగుతోంది. పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే సంబంధిత ఎస్‌డిపిఓ ఈ విషయాన్ని విచారించాలని, బాధ్యులు ఎవరైనా వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
