పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి భారత ప్రధాని నరేంద్రమోదీ  థ్యాంక్స్ చెప్పారు. శనివారం ప్రధాని మోదీ పంజాబ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా....  అక్కడ కర్తార్ పూర్ కారిడార్, గురుద్వారా లో మోదీ పర్యటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించేందుకు ఇవాళ ఆయన పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్ లోధి వచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి దన్యావాదాలు తెలియజేశారు. భారతీయుల మనోభావాలను గౌరవించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియాజీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని మోదీ అన్నారు. ఈ ప్రసంగంలో మోదీ... ఇమ్రాన్ పూర్తి పేరు పలకడం విశేషం. కాగా.. ఇమ్రాన్ తో పాటు  పంజాబ్ ప్రభుత్వం, ఎన్జీపీీతో పాటు కర్తార్ పూర్ కారిడార్ నిార్మాణంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలియజేశారు.

తొలుత మోదీ డేరా బాబా నానక్‌ను సందర్శించి ఇక్కడి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు (ఐసీపీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గురుబనీని ప్రపంచంలోని పలు భాషల్లోకి తర్జుమా చేస్తున్నాం. ఈ పనికి చొరవతీసుకున్న యునెస్కోకి కృతజ్ఞతలు. గురు నానక్ దేవ్‌పై పరిశోధనలను ప్రోత్సహించేందుకు బ్రిటన్‌లోని ఓ యూనివర్సిటీ, కెనడాలోని మరో యూనివర్సిటీ కృషిచేస్తున్నాయి...’’ అని పేర్కొన్నారు.
 
గురు నానక్ దేవ్‌కి సంబంధించిన అన్ని పుణ్య క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సేవలను ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. అమృత్‌సర్, కేశ్‌ఘర్, ఆనంద్‌పూర్, డామ్‌డమ, పాట్నా, నాందేడ్‌లలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతూ రైల్వేశాఖ కొత్త రైళ్లను నడపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, లద్దాక్‌లలో ఆర్టికల్ 370 రద్దుతో సిక్కులకు విశేష లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలంతా దేశ ప్రజలతో సమానంగా హక్కులను పొందుతారన్నారు.