కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని తల్లిదండ్రుల కంటే తానే ముందు ఎత్తుకొన్నానని రాజమ్మ చెబుతోంది.
వయనాడ్: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని తల్లిదండ్రుల కంటే తానే ముందు ఎత్తుకొన్నానని రాజమ్మ చెబుతోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.ఇదే నియోజకవర్గంలో రాజమ్మ నివాసం ఉంటున్నారు.
కేరళకు చెందిన రాజమ్మ వవాతిల్‌కు 72 ఏళ్ల వయస్సు ఉంటుంది. 48 ఏళ్ల క్రితం తన చేతులతో రాహుల్ గాంధీని లేబర్ రూమ్‌లో తాను తొలిసారిగా ఎత్తుకొన్నానని ఆమె గుర్తు చేసుకొన్నారు.
అది 1970 జూన్ 19 అనుకుంటా.. ప్రధానమంత్రి మనవడు జన్మించడంతో మేమంతా ఎలాంటి ఉద్వేగంతో నిండిఉంటామో మీరు ఊహించుకోవచ్చు. అందరూ సంభ్రమాశ్చర్యంలో మునిగితేలారు. రాహుల్ చూడముచ్చటగా ఉండడంతో అందరూ తమ చేతుల్లోకి తీసుకుని మురిసిపోయారు. ఆయన తల్లిదండ్రులకంటే ముందు మేమే ఆయనను చూశామని ఆమె గుర్తు చేసుకొన్నారు.
సోనియా గాంధీ ఆస్పత్రి నియమాలకు కట్టుబడి సహకరించారని రాజమ్మ ప్రస్తావించారు.. భద్రతా ఏర్పాట్లతో కూడా తమకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వలేదన్నారు. సోనియాకు ఆనాడు ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. మధ్యాహ్నం తాను లేబర్ రూంలోకి వెళ్లి ఆమెను కలుసుకున్నానని ఆమె చెప్పారు. తనకు ఆమె చక్కగా సహకరించారన్నారు.
లేబర్ రూమ్‌లోకి వచ్చేందుకు ఆస్పత్రి యాజమాన్యం అనుమతి ఇచ్చినప్పటికీ రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు బయటే నిలబడి వేచిచూశారన్నారు. అప్పుడా ఇద్దరూ తెల్లటి కుర్తాలు ధరించి ఉన్నారని రాజమ్మ గుర్తుచేసుకున్నారు. పాట్నా పర్యటనలో ఉన్న నాటి ప్రధాని ఇందిరా గాంధీ... మూడు రోజుల తర్వాత మనవడిని చూడడానికి వచ్చారన్నారు.
అహ్మదాబాద్‌లో ఆర్మీకి సేవలు అందించిన రాజమ్మ.. 1987లో కేరళకు తిరిగివచ్చారు. రాహుల్ ఇప్పుడు వయనాడ్ నుంచి పోటీచేయడం తనకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ... ఎన్నికల ప్రచారంలో తన మనవడిని(రాహుల్) కలుసుకోలేకపోయినందుకు చింతిస్తున్నానని రాజమ్మ పేర్కొన్నారు. రాహుల్ జన్మించినప్పుడు ఆమెకు 23 ఏళ్లు. నర్సింగ్‌లో డిగ్రీ చదివిన తర్వాత ఆమె హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలోనే రాహుల్ గాంధీ జన్మించారని ఆమె చెప్పారు.
