UP Assembly Election 2022: 'నేనెప్పుడూ ఏ పదవి వెంబడి పరుగెత్తలేదు..నేను బీజేపీకి సాధారణ కార్యకర్తను. పార్టీ నాకు ఇచ్చిన పనిని నిర్వర్తిస్తాను అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు.
UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు సరవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో నువ్వా-నేనా అనే విధంగా ముందుకు సాగుతూ.. ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని లక్ష్యంగా చేసుకునేందుకు ప్రత్యర్థులు లఖింపూర్ ఖేరీ ఘటనను జలియన్‌వాలా ఊచకోతతో పోల్చే విధంగా విమర్శలు చేయడం దారుణమని పేర్కొన్న ఆయన.. ఈ విషయంలో చట్టం తనదైన శైలిలో వ్యవహరిస్తోందనీ, ఎన్నికల్లో రాజకీయ మైలేజీని పొందేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నమని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. అయితే, ఇందులో వారు విజయవంతం కాలేదని పేర్కొన్నారు.
యూపీ ఎన్నికల్లో ఇతర పార్టీలు రెండవ స్థానం కోసం మాత్రమే ఎన్నికల్లో పోరాడుతున్నాయనీ, గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి పోటీ గురించి తాను ఆందోళన చెందడం లేదని సీఎం యోగి అన్నారు. ప్రధానమంత్రి పదవిపై ఆశ ఉందా అని అడిగిన ప్రశ్నకు.. "నేను బీజేపీ సాధారణ కార్యకర్తను.. పార్టీ నాకు ఇచ్చిన పనిని నిర్వహిస్తాను. నేను ఎన్నడూ ఏదైనా పోస్టు కోసం కానీ, కూర్చీ కోసం కానీ పరుగెత్తలేదు" అని యోగి పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి బలమైన పోటీ దారు ఎస్పీనే అని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం పై ప్రశ్నించగా.. యోగి ఒక చిరునవ్వు నవ్విన అనంతరం.. నేరస్థులు, మాఫియా డాన్‌లు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారికి టిక్కెట్లు పంపిణీ చేయడం వల్ల పార్టీ (ఎస్పీ) 'కొంచెం కూడా' మారలేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. "నయీ హవా హై పర్ వహీ SP హై". గతంలో లాగా కటకటాల వెనుక ఉన్న నేరస్థులు, మాఫియాలు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులుగా మార్చిన ఆ పార్టీ తీరులో కొంచెం కూడా మార్పు రావడం లేదు’’ అని అన్నారు.
చట్టాన్ని ఉల్లంఘించేవారికి ఓటు వేయాల్సిన అవసరం లేదని అఖిలేష్ యాదవ్ తన ర్యాలీలలో చేసిన ప్రకటనను ఎత్తిచూపిన యోగి.. "పాత పాలనను తిరిగి తీసుకురావడానికి చట్టాన్ని ఉల్లంఘించేవారిని మరియు సంఘవిద్రోహశక్తులను కలిసి కావాలని ఆయన కోరుతున్నారు" అని ఎద్దేవా చేశారు. గత ఎస్పీ ప్రభుత్వం మాఫియా డాన్‌లకు, నేరస్థులకు స్వేచ్ఛనిస్తోందని ఆరోపించిన యోగి.. బీజేపీ శాంతిభద్రతల సమస్య ప్రధాన ఎన్నికల ప్రణాళికగా ముందుకు సాగుతుందని తెలిపారు. అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్ర కాన్వాయ్ రైతులను ఢీ కొట్టడంతో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను బ్రిటిష్ పాలనలో జరిగిన జలియన్‌వాలా బాగ్ ఊచకోతతో పోల్చిన అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన యోగి.. చట్టం తన పనిని తాను చేసుకుంటుందనీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని అన్నారు. "సుప్రీంకోర్టు ఈ విషయాన్ని విచారణ జరుపుతోంది. ఈ ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిష్పక్షపాతంగా పనిచేస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు" అని తెలిపారు.
ఇదిలావుండగా, లఖింపూర్ ఖేరీ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ విషయంలోనే ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఇక గత వారం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేయడంతో ఈ విమర్శలు, ఆరోపణలను ప్రతిపక్షాలు మరింతగా పెంచాయి. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన యోగి.. రైతు ప్రయోజనాలకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రారంభించిన వివిధ పథకాలకు బీజేపీ మద్దతు ఇస్తున్నదని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగడంపై మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27న ఐదో దశలో ఓటింగ్ జరగనున్న గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నాననీ, దీనిపై తనకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపారు. "నేను ఎందుకు ఆందోళన చెందాలి, ఇది సాంప్రదాయ బీజేపీ సీటు. అక్కడ పార్టీ కోసం ప్రజలు స్వయంగా పోరాడుతారు. ఈసారి కూడా వారు అదే చేస్తారు" అని తెలిపారు.
2022 యూపీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఎవరిని అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. "మాకు ఎవరితోనూ గొడవలు లేవు. ఎవరూ మాకు ప్రత్యర్థి కారు. వారు రెండో స్థానం కోసం పోరాడుతున్నారు" అని అన్నారు. 80 శాతం మంది ఓటర్లలో మాకు బలమైన మద్దతు ఉందనీ, మిగిలిన 20 శాతం కోసం వారు తమలో తాము పోరాడుతున్నారని యోగి అన్నారు. ముస్లింలను వ్యతిరేకిస్తున్నారనేది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయమని విమర్శించారు. మళ్లీ అధికారం తమదేనని పేర్కొన్న యోగి.. ఈ సారి నేరస్థులు, మాఫియాలపై తన ఆపరేషన్‌ను కొనసాగిస్తానని ఉద్ఘాటించారు.
