మహిళలపై అత్యాచారాలను ప్రోత్సహించేలా వున్న లేయర్ కంపెనీ షాట్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కంపెనీకి చెందిన రెండు యాడ్స్ ను ట్విట్టర్, యూట్యూబ్ నుంచి తొలగించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

స్త్రీలపై ద్వేషపూరితంగా , అత్యాచారాలను ప్రోత్సహించే విధంగా వున్న బాడీ స్ప్రే ప్రకటనల ప్రసారంపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మహిళా కమీషన్ రాసిన లేఖను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిగణనలోనికి తీసుకుంది. దీనిలో భాగంగా సదరు యాడ్ ఏజెన్సీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా వివాదాస్పద డియోడరెంట్ ప్రకటనలను తక్షణం సస్పెండ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే అడ్వర్టైజింగ్ కోడ్ ప్రకారం ఈ తరహా ప్రకటనలపై విచారణ జరుగుతుందని హెచ్చరించింది.

కాగా.. మాస్ మీడియాలో స్త్రీ ద్వేషపూరిత ప్రకటనలను ప్రసారం చేయవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా కమీషన్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాసింది. పెర్ఫ్యూమ్ బ్రాండ్ Layer'r Shotపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో భగ్గమనడంతో ఈ తరహా ప్రకటనలపై వివాదం రేగింది. ఈ ప్రకటన ‘‘గ్యాంగ్ రేప్ సంస్కృతిని ప్రోత్సహించేలా వుందని’’ శనివారం మహిళా కమీషన్ పేర్కొంది. అంతేకాదు ఈ విషయంపై తక్షణం విచారణ జరపాలంటూ ఢిల్లీ పోలీస్ శాఖను సైతం ఆదేశించింది. 

 

Scroll to load tweet…

 

ఈ నేపథ్యంలోనే Layer'r Shot వాణిజ్య ప్రకటనకు సంబంధించి కేంద్ర ప్రసార శాఖకు కమీషన్ లేఖ రాసింది. ఈ ప్రకటనను తక్షణం నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కమీషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అత్యాచార సంస్కృతిని ప్రోత్సహించే ఇలాంటి మురికి ప్రకటనలు మళ్లీ ప్రసారం కాకుండా వుండేలా కొన్ని తనిఖీలు , దీనిలో ప్రామాణికతను నిర్థారించడానికి బలమైన వ్యవస్థలను నిర్మించాలని మలివాల్ కోరారు. 

అలాగే సదరు పెర్ఫ్యూమ్ బ్రాండ్‌పై భారీ జరిమానా విధించాలని ఆమె డిమాండ్ చేశారు. తద్వారా ఇతర కంపెనీలు చౌకబారు ప్రచారం కోసం చెత్త వ్యూహాలు అమలు చేయవని స్వాతి మలివాల్ వ్యాఖ్యానించారు. ఇక.. ఈ  వ్యవహారంపై తీసుకున్న చర్యల నివేదికను జూన్ 9లోగా తమకు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను కమీషన్ ఆదేశించింది. ఢిల్లీ పోలీసులు, ప్రసార మంత్రిత్వ శాఖ ఏమాత్రం కాలయాపన లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని స్వాతి కోరారు.

ఇకపోతే.. భారత్‌కు చెందిన పర్‌ఫ్యూమ్‌, డియోడ్రంట్‌, స్ప్రే ఉత్పత్తిదారు ‘‘లేయర్స్‌’’ కంపెనీ తన ఉత్పత్తుల ప్రచారానికి సంబంధించి తాజాగా రూపొందించిన రెండు యాడ్స్‌పై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండూ ప్రకటనలు కూడా డబుల్‌ మీనింగ్‌ ఉద్దేశ్యంతో.. యువతులను అగౌరవపరిచేలా, కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. అత్యాచార సంస్కృతిని పెంపొందించేలా యాడ్స్ ఉన్నాయని చాలామంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

ఓ షాపింగ్‌మాల్‌లో కొందరు ఫ్రెండ్స్, ఓ యువతి మధ్య ఒక యాడ్ రూపొందించగా... మరో యాడ్ ను ఓ రూమ్ లో ఓ యువజంట‌ ఏకాంతంగా ఉండగా, అదే సమయంలో అతడి ఫ్రెండ్స్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో జరిగే సంభాషణల ఆధారంగా యాడ్‌ను రూపొందించారు. ఈ రెండు యాడ్స్‌ మెయిన్‌ థీమ్‌ కూడా ‘షాట్‌’ను ప్రమోట్‌ చేసేదే. అయితే ప్రమోషన్‌ సంగతి ఎలా ఉన్నా.. దీని వెనుక చెత్త ఆలోచన ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ వాణిజ్య ప్రకటనలను ప్రచారం చేశారు. ఈ క్రమంలో అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ASCI) సోషల్‌ మీడియాలో ఈ రెండు షాట్‌ యాడ్స్‌ దుమారంపై స్పందించింది. ఆ యాడ్స్‌ను తొలగించడంతో పాటు దర్యాప్తునకు ఆదేశించినట్లు ట్విటర్‌లో పేర్కొంది.  ఈ రెండు యాడ్స్ ను ట్విట్టర్, యూట్యూబ్ నుంచి తొలగించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.


 

Scroll to load tweet…