సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అంచనాలు ఎక్కువ ఉన్నాయనే విషయం తెలుసు అని, కానీ, తాను ఇక్కడ అద్భుతాలు చేయనని వివరించారు. 

న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అంచనాలు ఎక్కువ ఉన్నాయనే విషయం తెలుసు అని వివరించారు. కానీ, తాను ఇక్కడ అద్భుతాలు సృష్టించడానికేమీ రాలేదని తెలిపారు. దేశ ప్రధాన న్యాయమూర్తిగా తాను సుప్రీంకోర్టు సహ న్యాయమూర్తుల అపార అనుభవాన్ని న్యాయవ్యవస్థకు సరిగ్గా ఉపయోగపడేలా చూస్తానని, వారికి ఉన్న మేధస్సును ఈ వ్యవస్థ సాధారణంగా చాలా తక్కువగా వినియోగించుకుంటుందని వివరించారు.

‘సో.. నేను స్థూలంగా చెప్పేదేమంటే, నేను ఇక్కడికి అద్భుతాలు సృష్టించడానికి రాలేదు. నాకు తెలుసు సవాళ్లు గంభీరంగా ఉన్నాయి, అంచనాలూ అంతే భారీగా ఉన్నాయి. నాపై విశ్వాసం పెట్టుకున్నవారికి కృతజ్ఞతలు. కానీ, నేను అద్భుతాలు ఇక్కడ అద్భుతాలు చేయను’ అని వివరించారు. సుప్రీంకోర్టు సీజేఐగా నియామకమైన డీవై చంద్రచూడ్‌ను సన్మానించడానికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడారు.

Also Read: తండ్రి బాటలో తనయుడు.. నూతన సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం.. తొలి సందేశంలో ఏమన్నారంటే..?

‘ఇవాళే నా జీవితంలో చివరి రోజు అనే ప్రతి రోజూ తన లక్ష్యాన్ని పెట్టుకోవడాన్ని నమ్ముతాను. ఈ రోజు కొంత మంచి చేశానా? లేదా? అని చూసుకుంటాను. ప్రతి రోజూ ఇదే నాకు నేను వేసుకునే ప్రశ్న’ అని వివరించారు.

నవంబర్ 9వ తేదీన జస్టిస్ చంద్రచూడ్ 50వ సీజేఐగా బాధ్యతలు తీసుకున్నారు. రెండేళ్లపాటు అంటే 2024 నవంబర్ 10వ తేదీ వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. 

తాను రోజూ కలుసుకునే సహ న్యాయమూర్తులు తన కంటే చాలా బాగున్నారని, తన కంటే కూడా ఎక్కువ అనుభవం కలిగిన వారని వివరించారు. కాబట్టి, తన సహ న్యాయమూర్తుల అనుభవాన్ని తాను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. నా సహన్యాయమూర్తులపై ఎక్కువ ఆధారపడాలని భావిస్తున్నట్టు చెప్పారు. తద్వారా వారి అనుభవ ఫలాలను పొందడమే కాదు.. వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వీలవుతుందని తెలిపారు.

ఒక న్యాయమూర్తికి జ్యూడీషియల్ వర్క్‌కు మించిన సంతృప్తి మరేదీ ఇవ్వదని, అందులో రాజీ అనేదే ఉండదని తాను విశ్వసిస్తానని వివరించారు.