కరోనా వైరస్ దేశాన్ని చుట్టేస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందని భయపడి దేశంలో లాక్‌డౌన్ విధించడానికి ఆయన వెనకడుగు వేశారు.

దీంతో వైరస్ కారణంగా ప్రపంచంలో ఏ దేశం ఎదుర్కొని నష్టాన్ని అగ్రరాజ్యం చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ట్రంప్‌పై అమెరికన్లతో పాటు ప్రపంచం దుమ్మెత్తిపోసింది.

ఈ నేపథ్యంతో తానేమి ట్రంప్‌ను కాదు.. తన కళ్ల ముందే ప్రజలు బాధపడుతుంటే చూడలేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే..  శివసేన అధికారిక పత్రిక సామ్నా కోసం ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్‌కు ఉద్ధవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వారాంతంలో రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇంటర్య్వూకు సంబంధించిన టీజర్‌ ‘అన్‌లాక్ ఇంటర్వ్యూ’ పేరుతో సంజయ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అయితే ట్రంప్‌ను ప్రస్తావిస్తూ ఉద్దవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారనే విషయం తెలియాల్సి వుంది. ఇంటర్వ్యూ పూర్తిగా వచ్చాకే ఆ విషయం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే టీజర్‌లో ముంబై వీధుల్లో వడాపావ్ ఎప్పుడు దొరుకుతుందని సంజయ్ అడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ స్పందించారు.

అలాగే లాక్‌డౌన్ కొనసాగింపు, మినహాయింపులపైనా ఆయన ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు. మరోవైపు మనదేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 8,336 కొత్త కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 3,27,031కి చేరింది.