కరోనా వైరస్ మహమ్మారి భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. తెలంగాణాలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్టుగా కనబడుతున్నప్పటికీ.... కేసుల సంఖ్యమాత్రం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా జంటనగరాల పరిధిలో ఈ కేసులు విపరీతంగా ఉన్నాయి. 

హైదరాబాద్ జిల్లాను గనుక చూసుకుంటే... తెలంగాణలో నమోదయిన మొత్తం కరోనా కేసుల్లో కేవలం హైదరాబాద్ జిల్లాలోనే 56 శాతం కేసులు నమోదయ్యాయి. ఇక నీతిఆయోగ్ డేటా ను గనుక పరిశీలిస్తే... దేశంలోనే కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదయిన టాప్ 5 జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. దేశం మొత్తం మీద నమోదయిన కేసుల్లో హైదరాబాద్ లో 2.7 శాతం కేసులు నమోదయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కర్నూల్, గుంటూరు జిల్లాలు కూడా టాప్ 25 కరోనా ప్రభావిత జిల్లాల జాబితాలో చోటు సంపాదించాయి. దేశం మొత్తం నమోదైన కేసుల్లో 1 శాతం కేసులు కర్నూల్ లో నమోదయితే, 0.9 శాతం కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. 

నీతిఆయోగ్ దేశం మొత్తం మీద ఈ కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న 27 జిల్లాల లిస్టును బయట పెట్టింది. గుజరాత్ లో మొత్తం నమోదైన కేసుల్లో అహ్మదాబాద్ నుండే 62.4 శాతం కేసులు నమోదై అత్యధిక శాతం కేసులు నమోదైన జిల్లాగా నిలవగా, ఆతరువాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది. 

ఇకపోతే, భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేలు దాటింది. శనివారం ఉదయం ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 24,506కు చేరుకుంది. మొత్తం 775 మంది కరోనా వైరస్ వ్యాధితో మరణించారు.

దేశంలో కరోనా వైరస్ నుంచి 5062 మంది కోలుకున్నారు. దాంతో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 18668కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 1429 కేసులు కొత్తగా నమోదు కాగా, 57 మరణాలు రికార్డయ్యాయి. 

లాక్ డౌన్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. కిరాణా దుకాణాలను తెరవడానికి అనుమతించింది. మాల్స్ మాత్రం మూసే ఉంటాయి. కొన్ని ఆంక్షలతో కిరాణా దుకాణాలను తెరిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్లకు ఆ సడలింపులు వర్తించవు.

మాస్క్ లు, గ్లౌజులు, సామాజిక దూరం అనివార్యంగా పాటించాలి. దుకాణాల్లో 50 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతించాలని సూచించింది.