బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రద్దీపై హైదరాబాద్‌కు చెందిన ఓ ఆర్టిస్ట్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు 3 గంటల పాటు ట్రాఫిక్‌లో కదలకుండా ఇరుక్కుపోతే.. ఏం చేస్తారు..? అప్పుడు కూడా వాతావరణాన్ని మెచ్చుకుంటారా అని సెటైర్లు వేశారు.
కర్ణాటక రాజధాని, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు నగరం అద్భుతమైన వాతావరణానికి ప్రసిద్ధి. వేసవిలోనూ, శీతాకాలంలోనూ బెంగళూరు వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. అయితే అలాంటి బెంగళూరు వాతావరణంపై హైదరాబాద్‌కు చెందిన ఆర్టిస్ట్ అనూజ్ గుర్వారా ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోలో.. బెంగళూరుకు చెందిన తన మిత్రులు ఆ నగర వాతావరణం గురించి గొప్పలు చెబుతుంటారని అనూజ్ ఎద్దేవా చేశాడు. నిజానికి బెంగళూరు చాలా మంచి నగరమని, తనకు చాలా ఇష్టమని... అక్కడ ఎంతోమంది మిత్రులు వున్నారని ఈ కారణం చేత తాను తరచుగా బెంగళూరు సందర్శిస్తానని అనూజ్ చెప్పాడు.
బెంగళూరు వాళ్లకి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తే వాళ్లు వాతావరణం గురించి మాట్లాడతారని, పార్శిల్ వచ్చిందని చెబితే మళ్లీ వాతావరణం గురించి మాట్లాడతారంటూ చురకలు వేశాడు. నేను దానికి ఒప్పుకుంటాను... యునెస్కో కూడా బెస్ట్ క్లైమేట్ అవార్డు ఇచ్చింది అయితే ఇప్పుడేం చేయాలి..? మీరు 3 గంటల పాటు ట్రాఫిక్‌లో కదలకుండా ఇరుక్కుపోతే.. ఏం చేస్తారు..? అప్పుడు కూడా వాతావరణాన్ని మెచ్చుకుంటారా అని అనూజ్ సదరు వీడియోలో ప్రశ్నించాడు.
అదే హైదరాబాద్‌లో తమకు అంత సమయం పట్టదని.. తమకు పెద్దవైన రోడ్లు వున్నాయని.. గమ్యాన్ని చేరుకోవడానికి మూడు వేర్వేరు మార్గాలు వున్నాయని అనూజ్ వ్యాఖ్యానించారు. మీరు మాత్రం వన్ వే చిట్టడవిలో చిక్కుకుపోయి... గమ్యాన్ని మాత్రం చేరుకోలేరని, ఇంకా ఏదైనా చెబితే మళ్లీ వాతావరణం గురించి మాట్లాడతారంటూ అనూజ్ దుయ్యబట్టారు. దీనిపై బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా అనూజ్ గుర్వారా వీడియోపై స్పందించారు.
దీనికి మళ్లీ అనూజ్ బదులిస్తూ... తన వీడియో దేశవ్యాప్తంగా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోందన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహ విద్యార్ధులు, సహోద్యోగుల నుంచి టన్నుల కొద్దీ సందేశాలు , స్క్రీన్ షాట్‌లు వచ్చాయన్నారు. అయితే కంటెంట్ క్రియేటర్ల కోసం ఓ గమనిక... ఎప్పుడూ వాటర్ మార్క్‌ని ఉపయోగించండి అంటూ కిరణ్ మజుందార్ షాకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
