మగపిల్లాడు పుట్టలేదని ఓ వ్యక్తి భార్య పట్ల కఠినంగా ప్రవర్తించాడు. వేడి వేడి మసిలే నీళ్లు.. ఆమెపై పోశాడు. 

మొన్నటికి మొన్న ఓ వ్యక్తి భార్యకు ఆడపిల్ల పుట్టకూడదని ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడు. ఈ సంఘటన మరవకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. వరసగా ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని.. మగపిల్లాడు పుట్టలేదని ఓ వ్యక్తి భార్య పట్ల కఠినంగా ప్రవర్తించాడు. వేడి వేడి మసిలే నీళ్లు.. ఆమెపై పోశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన సత్యపాల్‌కు సంజు అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు కుమార్తెలే పుట్టడంతో పుట్టింటి నుంచి అదనపు కట్నం రూ. 50 వేలు తీసుకురావాలంటూ కొంతకాలంగా సత్యపాల్‌ భార్యను వేధిస్తున్నాడు. ప్రతి రోజూ ఇదే విషయంపై హిసించసాగాడు. 

మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్యపై ద్వేషం పెంచుకున‍్న సత్యపాల్‌ కొద్ది రోజులుగా సంజూకు భోజనం కూడా పెట్టడం లేదు. ఇక ఈ క్రమంలోనే ఈ నెల 13న ఇంట్లో ఉన్న తన భార్యతో వాగ్వాదానికి దిగిన సత్యపాల్ ఆవేశంలో పక్కనే స్టవ్‌పై మరుగుతున్న వేడినీటిని ఆమెపై పోశాడు. దీంతో సంజూ తీవ్రంగా గాయపడటంతో గమణించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.