రాయగడ: ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఓ వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. భార్య అశ్లీల చిత్రాలను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన రాయగడ జిల్లాలోని గుణపూర్ లో మంగళవారంనాడు జరిగింది. 

బలంగీర్ లోని టిట్లాగఢ్ పరిధిలో గల జగన్నాథ గ్రామానికి చెందిన గోవిందరావుకు తన భార్యతో గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. భర్త తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అతని భార్య గుణుపూర్ పోలీసు స్టేషన్ లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు గోవింద రావుపై కేసు నమోదు చేసి, అతన్ని కోర్టుకు తరలించారు. 

ఆ తర్వాత బెయిల్ మీద గోవిందరావు విడుదలయ్యాడు. తిరిగి భార్యను వేధించడం ప్రారంభించాడు. దాంతో భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె గుణుపూర్ లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త దాన్ని సహించలేకపోయాడు. 

భార్య అశ్లీల చిత్రాలను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ దారుణమైన వ్యాఖ్యలను పెట్టాడు. దాంతో భార్య గుణుపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి గోవిందరావును అరెస్టు చేశారు.