తన భర్తది.. తమ కులం కాదని.. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. బ్రాహ్మణుడినని చెప్పి.. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆమె కట్టుకున్న భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బేచ్‌రాజి తాలూకా అడివాడ గ్రామానికి చెందిన ఎక్తాపటేల్ అనే యువతి గత ఏడాది ఏప్రిల్ లో ఎంకాం చదివింది. ఎంకాం అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఎక్తాపటేల్ మెహసానా ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో అకౌంటెంట్ గా చేరారు. గ్యాస్ డీలరు జ్యోత్స్నా కుమారుడు యష్ తో ఎక్తాపటేల్ కు పరిచయం ఏర్పడింది. తాము బ్రాహ్మణులమని యష్ చెప్పడంతో అతనితో ఎక్తాపటేల్ ప్రేమలో పడింది. 

అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 23వతేదీన ఏక్తాపటేల్, యష్ లు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం కాపురం పెట్టాక తన భర్త బ్రాహ్మణుడు కాదని తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తేలింది. దీంతో ఎక్తాపటేల్ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.