ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే ఉంటున్నదని, తరుచూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటున్నదని భర్త.. ఆమెపై దాడి చేశాడు. గొంతు నులిమి పారిపోయాడు. పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులతో ఆ నిందితుడు తన అనుమానాలను చెప్పుకొచ్చాడు. 

బెంగళూరు: ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో కుటుంబాల్లో గొడవలు రావడం కొత్తేమీ కాదు. కానీ, ఆ గొడవలు చిన్నపాటి వాగ్వాదంతో సమసిపోతుంటాయి. కానీ, బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తన భార్యపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసి పారిపోయాడు. పోలీసులు ఆ దుండగుడిని వెతికి పట్టుకున్నారు. పోలీసులకు ఆయన ఏం చెప్పారంటే..!

కర్ణాటకలోని కావేరీపురకు చెందిన అశోక్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్. అశోక్ భార్య పేరు వనజాక్షి (31). 15 ఏళ్ల దాంపత్యంలో ఈ ఇద్దరు దంపతులకు ముగ్గురు సంతానం కలిగింది. ఇంట్లో ఈ ఇద్దరు భార్యభర్తలూ డ్యూటీ చేస్తుంటారు. ఆదివారం రాత్రి వీరిద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆపై భార్యపై అశోక్ భౌతికదాడికి దిగాడు.

తన భార్య తరుచూ ఫోన్ పట్టుకునే ఉంటున్నదని, ఫోన్ వదలట్లేదని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తరుచూ ఫోన్ కూడా ఆమె మాట్లాడుతున్నట్టు, బహుశా తన భార్య వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నట్టు ఆయన అనుమానించాడు. ఈ కోణంలోనే వారిద్దరి మధ్య గొడవ రాజుకుంది. మొబైల్ ఫోన్‌లో ఆమె మరొకరితో మాట్లాడుతున్నట్టు భావించి అశోక్ ఆమె వద్దకు వెళ్లి చెంప చెళ్లుమనిపించాడు. ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. వెంటనే కిచెన్‌లోకి వెళ్లి ఓ కొర్రాసు పట్టుకొచ్చింది. తన భర్తపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ, ఆ ప్రయత్నాన్ని భర్త తిప్పికొట్టాడు. ఆ కొర్రాసును ఆమె చేతి నుంచి లాక్కుని మరోసారి ఆమె చెంపపై కొట్టాడు. ఆ తర్వాత ఆమె నేలపై పడిపోయింది. ఆ తర్వాత భర్త ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గొంతు నులిమేసి పారిపోయాడు.

ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బుధవారం వనజాక్షి సోదరుడు ఇంటికి వచ్చాడు. ఇంటి బయటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు నిందితుడు అశోక్‌ను పట్టుకున్నారు.

తన భార్య మరికొరితో ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని చూశానని, వెంటనే ఆమె చెంపపై కొట్టానని, అనంతరం ఆమె తనపై దాడికి ప్రయత్నించిందని నిందితుడు అశోక్.. పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాతి ఘర్షణల్లో తాను తన భార్య గొంతు నులిమి పారిపోయినట్టు వివరించాడు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే ఘోరం జరిగింది. అక్క భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను అడ్డు తొలగించిన భార్య, ఆమెకు సహకరించిన బావ, మరో ఇద్దరు యావజ్జీవ కారాగార శిక్షకు గురయ్యారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలం పొనుపాడికి చెందిన నల్లబోతు నరేంద్ర తన సమీప బంధువు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని శ్రీవిద్యను వివాహం చేసుకున్నాడు. అతను పేరేచర్ల పరిశ్రమలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. వీరికి సంతానం లేదు. పెళ్లికి ముందు నుంచి తన అక్క భర్త గొట్టిపాటి వీరయ్య చౌదరితో శ్రీవిద్యకు వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి అయ్యాక ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని.. భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నరసరావుపేట పెద్ద చెరువులో నివసించే అక్క ఇంటినుంచే కుట్రకు తెరలేచింది.