భార్య జీన్స్ వేసుకోవాలని, డ్యాన్స్ చేయాలని కోరాడో భర్త.. అది తనకు ఇష్టం లేదంది భార్య.. అంతే ఆమెకు తీన్ తలాక్ చెప్పాడు... ఆ తరువాత తాను కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. విచిత్రంగా, అయోమయంగా ఉన్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. 

వివరాల్లోకి వెళితే మీరట్‌లోని న్యూ ఇస్లాంనగర్ నివాసి అమీరుద్దీన్ కుమార్తె మహజబీకి ఎనిమిదేళ్ల క్రితం హాపుర్ పరిధిలోని పిల్‌ఖువా నివాసి అనస్‌తో నిఖా జరిగింది. పెళ్లై ఎనిమిదేళ్ల తరువాత అనస్ కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు. తరచూ గొడవలు జరుగుతుండేవి.

పెద్దల జోక్యంతో వారికి సర్దిచెప్పి పంపిస్తున్నారు. ఈ మధ్య కూడా మహజబీ, అనస్ ల మధ్య మళ్లీ గొడవ వచ్చింది. ఈ నేపధ్యంలో పెద్దలు కలగజేసుకుని వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మహజలీ.... భర్త తనను జీన్స్ వేసుకోవాలని, డాన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించింది. 

ఈ మాటలు విన్న పెద్దలు వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించేశారు. మహజబీ తల్లిగారింట్లోనే ఉంది. ఈ రాజీ జరిగిన తరువాత రెండు రోజుల క్రితం అనస్ అత్తగారింటికి వచ్చాడు. అక్కడున్న భార్య మహజబీకి తీన్ తలాక్ చెప్పాడు. తరువాత అక్కడే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 

ఇది గమనించిన చుట్టుపక్కలవారు అతనిపై నీళ్లు పోసి నిప్పును ఆర్పారు. దీంతో అనస్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.