పెళ్లై 12 సంవత్సరాలు అయ్యింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా సంతానం కలగలేదు. ఎవరో నాటు మందు తీసుకుంటే.. పిల్లలు పుడతారనే చెప్పడంతో నిజమని నమ్మారు. భార్య భర్త ఇద్దరూ ఆ మందు తీసుకున్నారు. కాగా... ఆ మందు వికటించి భార్యభర్తలు ఇద్దరూ ప్రమాదంలో పడ్డారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం నెలమంతగల లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నెలమంగల తాలూకా అరిశినకుంట గ్రామానికి చెందిన శశిధర్, గంగమ్మ దంపతులకు 12ఏళ్ల క్రితం వివాహమైంది. అయినా వారికి సంతానం కలగలేదు. కాగా... సోమవారం కొందరు కారులో మూలికలు అమ్ముతూ... తమ వద్ద మూలికలు తీసుకుంటే పిల్లలు పుడతారని ఆ దంపతులను నమ్మించారు.

నిజమని నమ్మిన శశిధర్, గంగమ్మ దంపతులు ఆ మూలికలు తీసుకొని మింగారు. కాగా... ఆ మందు సత్ఫలితాలను ఇవ్వకపోగా... వికటించింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. శశిధర్ ఆస్పత్రిలో కన్నుమూయగా.. గంగమ్మ ప్రాణాలతో పోరాడుతోంది. గంగమ్మ వాంగ్మూలంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికి ఆ మందు అమ్మిన ముఠా కోసం గాలిస్తున్నారు.