భార్య పుట్టింటికి వెళ్లిందని ఓ భర్త సెల్ టవర్ ఎక్కేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో చోటుచేసుకుంది. పుట్టింటికి వెళ్లిన తన భార్య తిరిగి తన ఇంటికి వచ్చేంత వరకు సెల్ టవర్ దిగనను అతను బెదిరించడం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగ్రా నగరంలోని సికింద్రా ప్రాంతానికి చెందిన నరేష్ ప్రజాపతి.. ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకొని రజినీ అనే మరో అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు. తన రెండో భార్య రజినీ, పిల్లలతో జీవించేవాడు. కాగా ఇటీవల భర్తతో ఏర్పడిన కుటుంబ వివాదంతో భార్య రజనీ పుట్టింటికి వెళ్లి పోయింది. 

భార్య వెళ్లిపోవడంతో ఆవేదన చెందిన భర్త నరేష్ తన మూడు నెలల కూతురితో కలిసి విద్యుత్ హైటెన్షన్ స్తంభంపైకి ఎక్కి సినీ ఫక్కీలో నిరసన తెలిపారు. తన భార్య పుట్టింటి నుంచి వచ్చే వరకూ తాను విద్యుత్ స్తంభం పైనుంచి దిగనని నరేష్ భీష్మించుకు కూర్చున్నాడు. తనతోపాటు కూతురికి తినేందుకు ఆహారపదార్థాలు, పాలు తీసుకొని స్తంభం ఎక్కాడు. పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు, కుటుంబసభ్యులు కలిసి మాట్లాడి నరేష్ ను కిందకు దించారు.