Asianet News TeluguAsianet News Telugu

భార్య కొడుతున్నదని దెబ్బలు తప్పించుకోవడానికి చెట్టు ఎక్కిన భర్త.. నెల రోజులుగా అక్కడే

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య నుంచి దెబ్బలు తినకుండా తప్పుకోవడానికి చెట్టు ఎక్కాడు. నెల రోజుల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఈ ఘటన మావ్ జిల్లాలో చోటుచేసుకుంది.

husband climbed on palm tree to avoid wife beating
Author
First Published Aug 27, 2022, 6:39 PM IST

లక్నో: దంపతుల మధ్య గొడవలు సర్వసాధారణం. వాటి పరిష్కారం కూడా అంతే సాధారణంగా ఉంటుంది. తరుచూ గొడవలు రావడం.. సమసిపోవడం రోజూ మనం చూస్తూనే ఉంటాం. కొన్ని గొడవలు మాటలకే పరిమితమైతే మరికొన్ని సార్లు ఈ గొడవ చేయి చేసుకునే దాకా వెళతాయి. ఈ అభిప్రాయ బేధాలు, గొడవలు తీవ్రతను బట్టి నిమిషాల నుంచి నెలల వ్యవధిలో ముగిసిపోతాయి. అన్ని గొడవలు ఇలాగే సమసిపోతాయని చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు ఈ యూపీ వ్యక్తికి ఎదురైన అనుభవాలు కూడా ఉంటాయి.

ఉత్తరప్రదేశ్ మావ్ జిల్లాకు చెందిన రామ్ ప్రవేశ్ తరుచూ భార్యతో గొడవపడి.. దెబ్బలు తినలేక ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. రామ్ ప్రవేశ్ ఇంటి ముందు ఓ పెద్ద కొబ్బరి చెట్టు ఉన్నది. భార్య చేతిలో తరుచూ దెబ్బలు తినడానికి బదులు తాను ఆ కొబ్బరి చెట్టు ఎక్కాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికి ఆయన చెట్టు ఎక్కి దాదాపు నెల రోజులు అవుతున్నది. అయినా.. చెట్టు దిగడానికి ఆయన ససేమిరా అంటున్నాడు.

తినడానికి కూడా కిందకు రావడం లేదు. దీంతో కుటుంబ సభ్యులే ఆయనకు ఆహారం తాడుకు కట్టి పెడుతున్నారు. వీలు చూసుకుని రామ్ ప్రవేశ్ ఆహారాన్ని పైనకు తీసుకుని తింటున్నాడు. కిందకు రావాలని రామ్ ప్రవేవ్ కుటుంబ సభ్యులు ఎంతో బ్రతిమిలాడారు. కానీ, కిందకు రాలేదు. ఊరి పెద్దలు కూడా కిందకు రావాలని కోరుతున్నారు. ఇలా విజ్ఞప్తి చేసినా.. రామ్ ప్రవేశ్ ఇటుకలు, రాళ్లతో దాడి చేస్తున్నాడు.

ఈ సమస్య కేవలం రామ్ ప్రవేశ్ ఇంటికే పరిమితం కాలేదు. ఆ ఊరి ప్రజలకూ పాకింది. ముఖ్యంగా ఆ ఊరి మహిళలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. సుమారు 100 అడుగుల ఎత్తు మేరకు ఉన్న ఆ చెట్టు మీద రామ్ ప్రవేశ ఉండటంతో ఆయనకు ఊరి మొత్తం కనిపిస్తున్నది. ప్రతి ఇంటిలో, ఇంటి ముందటి  పరివారంలో ఎవరు ఏం చేస్తున్నారు అనేవన్నీ కనిపిస్తున్నాయి. దీంతో మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహంతో వెంటనే చెట్టు దిగాలని కోరుతున్నారు. అయినా రామ్ ప్రవేశ్ ససేమిరా అంటున్నాడు.

ఊరి ప్రజలు అందరూ వచ్చి గగ్గోలు పెట్టినా దిగలేదు. దీంతో చివరకు వారంతా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ పరిస్థితిని వీడియో తీసుకున్నారు. త్వరలోనే యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios