ఉత్తరప్రదేశ్: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కళ్యాణ్ పూర్ కు చెందిన ఒక వ్యక్తి మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. వీటికితోడు ఆతని తాజా లిస్టులో జూదం కూడా చేరింది. కొత్తగా చేసుకున్న అలవాటుని బాగా ప్రాక్టీస్ చేయాలనుకున్నాడేమో, ఏకంగా ఇంట్లోనే దుకాణం తెరిచేసాడు. 

తన మిత్రులతో కలిసి జూదం ఆడడం మొదలుపెట్టాడు. ఉన్న డబ్బంతా అయిపోయింది. చివరికి పందెం పెట్టడానికి ఏమి మిగలలేదు. మహాభారతం గుర్తుకు తెచుకున్నాడేమో, ఆనాడు ధర్మరాజు ద్రౌపదిని ఒడ్డినట్టు, ఇతగాడు తన భార్యను పందెంగా పెట్టాడు. మరోమారు ఇతను ధర్మరాజు బాటలోనే నడుస్తూ పందెం కూడా ఓడాడు. 

ఆనాడు దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకొచ్చి వివస్త్రురాలిని చేస్తుంటే, సహాయానికి కృష్ణుడు వచ్చాడు. కానీ ఈ కలియుగంలో అది సాధ్యమా చెప్పండి? ఆ మహిళే తన తెలివితేటలు ఉపయోగించి చాకచక్యంగా వారి బారి నుండి తప్పించుకొని తన మానప్రాణాలను దక్కించుకుంది. 

మహాభారతంలో ద్రౌపది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ఆ కాలం నాటి రాచరిక న్యాయం ప్రకారం తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగింది. ఈ కలియుగంలో పోలీసుల వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకుంటే,వారు మాత్రం ఆ నలుగురిని అరెస్ట్ చేయకుండా వదిలేసారు. పై పెచ్చు దీన్ని భార్యా భర్తల గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. తనను నలుగురు బలవంతం చేయబోయారు అని కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడంలేదని, తనకు న్యాయం జరిగేలా చూడాలని సదరు బాధితురాలు డిమాండ్ చేస్తుంది.