భార్య దోసె వేసివ్వలేదని దారుణానికి ఒడిగట్టాడో భర్త. ఆమెమీద కత్తితో దాడిచేసి.. మరణానికి కారణమయ్యాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

తమిళనాడు : దోస అడిగితే వేసి ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపాడో భర్త. ఈ ఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం కత్తిపోట్లకు గురైన ఆ మహిళ మృతి చెందింది. కృష్ణగిరి జిల్లా మాతూరు సమీపంలోని ఎన్ మోటూరు గ్రామానికి చెందిన గణేషన్ (60) భార్య మాధమ్మాల్ (50). ఈ ఘటనలో మాధమ్మాల్ మృతి చెందింది. ఏప్రిల్ 11వ తేదీ ఈ ఘటన జరగగా సోమవారం నాడు ఆమె తుది శ్వాస విడిచింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 11వ తేదీన సాయంత్రం గణేషన్ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. తనకు దోసెలు వేసి పెట్టాలని భార్యను అడిగాడు. అతను అడిగినట్టుగానే మాధమ్మాల్ మూడు దోసెలు వేసి ఇచ్చింది. ఇంతలో గ్యాస్ అయిపోయింది. గణేషన్ తనకు మరో మూడు దోసెలు కావాలని అడిగాడు. కానీ గ్యాస్ అయిపోయిందని ఇంట్లో వేరే సిలిండర్ లేదని ఆమె చెప్పింది.

దోసల పెనంతో కొట్టి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తరువాత గుండెపోటు అని నాటకం...చివరికి..

దీంతో గణేషన్ తీవ్ర కోపానికి వచ్చాడు. తాను దోసలు అడిగితే గ్యాస్ అయిపోయింది అని చెబుతావా అంటూ కత్తితో మాధమ్మాల్ తల, చేయి నరికాడు. అత్త మీద మామ దాడి చేయడం చూసిన కోడలు విజయలక్ష్మి అడ్డుకోవడానికి వెళ్ళింది.. ఆమెతోపాటు వారి రెండేళ్ల చిన్నారి తానిషా కూడా ఉంది. ఈ తోపులాటలో వీరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

కోడలు విజయలక్ష్మి.. చిన్నారి తానీశా, మాధమ్మాల్ లను క్రిష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం నాడు మాధమ్మాల్ మృతి చెందింది. మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతుంది. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికి కారణమైన గణేషన్ ను మాత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మొదట దాడి కేసు పెట్టిన పోలీసులు మాధమ్మాల్ మరణంతో హత్య కేసుగా మార్చారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.