సారాంశం

Hurun India Rich List 2023: భారత్ లో అత్యంత ధనవంతుడిగా మరోసారి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు.  ఆయన సంపద ఎన్ని రేట్లు పెరిగిందో తెలుసా.. ?

Hurun India Rich List 2023: భారత్ లో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానా?  లేదా గౌతమ్ అదానా?  అనే ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతునే ఉంటుంది. ధనవంతుల జాబితాలో వీరిద్దరూ నిత్యం ఒకరికొకరూ పోటీ పడడమే ఇందుకు కారణం. తాజాగా విడుదలైన దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరిగి మొదటి స్థానంలో కైవసం చేసుకున్నారు. అత్యంత సంపన్న భారతీయుడిగా ముఖేష్ అంబానీ నిలిచారు.

ఎవరి సంపద ఎంత?

360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం.. అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో మొదటి స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కైవసం చేసుకున్నారు. ఆయన సంపద ఈ ఏడాది 2 శాతం పెరిగి రూ.8.08 లక్షల కోట్లకు చేరుకుంది.  ఆ తరువాత స్థానంలో అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన సంపద 57 శాతం తగ్గి రూ.4.74 లక్ష కోట్లకి చేరుకుంది. అదానీ ఆస్తులు తగ్గడానికి హిండెన్‌బర్గ్ నివేదిక కారణమని హురున్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ రీసెర్చర్ అనస్ రెహ్మాన్ జునైద్ ఆరోపించారు.

ఈ ఏడాది జనవరిలో US ఆధారిత షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఒక నివేదికను సమర్పించిందని, దీని కారణంగా అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనం సంభవించింది. అయితే.. గౌతమ్ అదానీ ఈ ఆరోపణలన్నీ నిరాధారమని పేర్కొన్నాడు. వాటిని తిరస్కరించాడు.

ఇక పూణేకు చెందిన వ్యాక్సిన్ తయారీదారు సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ పూనావాలా తన సంపద 36 శాతం పెరిగి రూ.2.78 లక్షల కోట్లకు చేరుకుని మూడో అత్యంత సంపన్న భారతీయుడిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు చెందిన శివ్ నాడార్ నాల్గవ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 23 శాతం పెరిగి రూ. 2.28 లక్షల కోట్లకు చేరుకుంది. టాప్ 10 జాబితాలో ఐదో స్థానంలో గోపీచంద్ హిందుజా , ఆరో స్థానంలో దిలీప్ షాంఘ్వీ , ఏడో స్థానంలో ఎల్ ఎన్ మిట్టల్ , ఎనిమిదో స్థానంలో రాధాకిషన్ దమానీ , తొమ్మిదో స్థానంలో కుమార్ మంగళం , పదో స్థానంలో నీరజ్ బజాజ్  ఉన్నారు. ఈ హురూన్ జాబితాలో 138 నగరాల నుండి మొత్తం 1,319 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి.

టాప్ 10లో నిలిచిన వారు ?

1. ముఖేష్ అంబానీ -  ₹808,700 కోట్లు 

2. గౌతమ్ అదానీ -  ₹474,800 కోట్లు  

3. సైరస్ ఎస్ పూనావల్ల -  ₹278,500 కోట్లు  

4. శివ్ నాడార్ -  ₹228,900 కోట్లు

5. గోపీచంద్ హిందూజా -  ₹1,76,500 కోట్లు  

6. దిలీప్ సంఘ్వి -  ₹1,64,300 కోట్లు  

7. LN మిట్టల్ -  ₹1,62,300 కోట్లు  

8. రాధాకిషన్ దమానీ - ₹1,43,900 కోట్లు  

9. కుమార్ మంగళం బిర్లా  - ₹1,25,600 కోట్లు 

10. నీరజ్ బజాజ్ - ₹1,20,700 కోట్లు