తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఇది మూడోసారి అన్నారు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్  అమరీందర్ సింగ్. గవర్నర్‌కు రాజీనామా అందించిన తర్వాత ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి మీడియాతో మాట్లాడారు. 

తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఇది మూడోసారి అన్నారు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. గవర్నర్‌కు రాజీనామా అందించిన తర్వాత ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి మీడియాతో మాట్లాడారు. తనకు ఇలా చేయడాన్ని అవమానంగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను కాంగ్రెస్‌లోనే వుంటానని.. అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అమరీందర్ సింగ్ తెలిపారు. హైకమాండ్‌కు తనపై విశ్వాసం లేనట్లుగానే వుందని.. అధిష్టానం ఎవరినైనా సీఎంగా చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.

రెండు నెలల్లో తనను మూడు సార్లు ఢిల్లీకి పిలిచారని అమరీందర్ చెప్పారు. సిద్ధూ నిలకడ లేని మనిషని.. అతనిని తెరపైకి తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తానని అమరీందర్ అన్నారు. పాక్ పీఎం, ఆర్మీ చీఫ్‌లకు సిద్ధూ స్నేహితుడని దేశం కోసం సిద్ధూని వ్యతిరేకిస్తానని ఆయన తేల్చిచెప్పారు. పాకిస్తాన్‌కు పంజాబ్ ఆయుధంగా మారొచ్చని అమరీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు.

అంతకుముందు కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌కు అందించారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆయన తన నివాసం నుంచి రాజ్‌భవన్ వెళ్లారు. అక్కడికి చేరుకుని గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ గవర్నర్‌ను కలిశారని, తన రాజీనామాతోపాటు క్యాబినెట్ మంత్రుల రాజీనామాలను సమర్పించినట్టు పంజాబ్ సీఎం మీడియా అడ్వైజర్ రవీన్ తుక్రాల్ వెల్లడించారు. మరికొద్దిసేపట్లో రాజ్‌భవన్ గేట్ ముందు మీడియాతో మాట్లాడనున్నట్టు తెలిపారు.

ALso Read:సిద్ధూతో గొడవ: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా

పంజాబ్‌లో కొన్ని నెలలుగా రాజకీయ సంక్షోభం రగులుతూనే ఉన్నది. సిద్దూ నాయకత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై ధిక్కారాన్ని వెల్లడించారు. పంజాబ్‌లో కొంతకాలంగా సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంపై సొంతపార్టీ నుంచే విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నవ్‌జోత్ సింగ్ సిద్దూ నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వీరిరువురి మధ్య వైరం పతాకస్థాయికి చేరింది. ఇరువురూ అదిష్టానంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కావాలని డిమాండ్ చేసే దాకా పరిస్థితులు వెళ్లాయి. అదిష్టానం చొరవ తీసుకుని సిద్దూను శాంతింపజేశాయి. పంజాబ్ కాంగ్రెస్ విభాగానికి చీఫ్ పదవి ఇచ్చి ఉపశమనం చేశాయి. కానీ, ఈ చర్య దీర్ఘకాలిక ఫలితాలనిచ్చినట్టు కనిపించడం లేదు.