మరి కాసేపట్లో అయోధ్యలో రామాలయానికి శంకు స్థాపన మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ పుణ్యకార్యం కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. అసలు రామాలయ నిర్మాణం అనేగానే.. ముందుగా మనకు గుర్తుకు వచ్చేది బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వాణీ ఈ నేపథ్యంలో.. ఈ ఘటనపై ఆయన స్పందించారు. తాను ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నానని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఆతృతతో ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. కాగా.. అద్వానీ ఈ మహోత్పవం గురించి మాట్లాడుతూ...తన కల సాకారమైన రోజు ఇదేనని బీజేపీ నేత అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ  భూమి పూజ చేయడం చారిత్రాత్మకమన్నారు. 

రామమందిర నిర్మాణం ప్రతి భారతీయుడికి ఓ ఉద్వేగపూరిత క్షణమని, బీజేపీ కల అని ఆయన అన్నారు. రధయాత్ర  ద్వారా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తన కర్తవ్యాన్ని నిర్వర్తించానంటూ ఉద్వేగభరితమయ్యారు. రాముడు ఒక ఆదర్శమని..రామమందిర నిర్మాణం రామరాజ్యానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలు ఆన్ లైన్ ద్వారా పాల్గొననున్నారు