ఇద్దరు వృద్ధ దంపతులు కొన్ని నెలలుగా ఓ గదిలో బందీలుగా మారారు. అత్యంత దయనీయ స్థితిలో గదిలోనే ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారడంతో.. అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిలౌన్‌లో రిటైర్డ్ జవాను జనమ్ సింగ్ నెగీ(60) అతని భార్య దేవకీదేవి(52) ఉంటున్నారు. వారు ఉంటున్న ఇంటి బయట ఎవరో తాళం వేశారు. దీంతో వారు నెలల తరబడి ఆ ఇంటిలో బందీగా మారిపోయారు. అయితే ఆ దంపతులు ఇంటిలో మగ్గిపోతుండటాన్ని గమనించిన పొరుగింటివారు వీడియో తీసి, ఆ దంపతుల కుమారునికి పంపారు. అలాగే సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 ఈ వీడియో చూసిన ఆ దంపతుల కుమారుడు జగత్ సింగ్ ఢిల్లీలోని వారి ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ గది తలుపులు పగులగొట్టి, ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారి కుమారుడు మాట్లాడుతూ తన తల్లిదండ్రులతో ఫోనులో మాట్లాడేందుకు ఎంతగానో ప్రయత్నించానన్నారు. 

ఇంతలో తనకు... తల్లిండ్రులకు సంబంధించిన వీడియో అందిందన్నారు. దీంతో తాను ఇంటికి వచ్చానని తెలిపారు. గ్రామంలోని ముగ్గురు వ్యక్తులపై తనకు అనుమానం ఉందని, వారే తల్లిదండ్రుల ఇంటికి తాళం వేసివుంటారని ఆయన పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించారు.