వివేక్ అనే పదేళ్ల బాలుడు గురువారం రాత్రి కనిపించకుండా పోయాడు. ఆ తరువాత ఆ చిన్నారి పొలంలో గొంతుకోసి హత్య చేయబడి కనిపించాడు.
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో ఓ పదేళ్ల చిన్నారి నరబలి ఘటన కలకలం రేపింది. క్షుద్రపూజలు చేసే మాంత్రికుడి సలహా మేరకు ఓ వ్యక్తి తమ బంధువు కుమారుడైన 10 ఏళ్ల బాలుడిని చంపాడు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆదివారం తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని పర్సా గ్రామ నివాసి కృష్ణ వర్మ కుమారుడు వివేక్ గురువారం రాత్రి కనిపించకుండా పోయాడని పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ వర్మ తెలిపారు. అదే రోజు రాత్రి పొలంలో గొంతు కోసిన చిన్నారి మృతదేహం లభ్యమైందని తెలిపారు.
విచారణలో, చనిపోయిన పిల్లాడి బంధువు అనూప్‌కు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడని, అతను మానసిక వికలాంగుడు, అనారోగ్యంతో ఉన్నాడని పోలీసులు కనుగొన్నారు. అతనికి ఎన్ని చికిత్సలు చేయించినా.. సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో అనూప్ తన గ్రామానికి సమీపంలోని ఓ క్షుద్ర వైద్యుడిని సంప్రదించాడని పోలీసులు తెలిపారు. అతని విషయాలన్నీ కనుక్కున్న మాంత్రికుడు అనూప్‌ను నరబలి ఇచ్చేందుకు ప్రేరేపించాడని, ఆ తర్వాత వివేక్ మామ చింతారామ్‌తో కలిసి చిన్నారిని కిడ్నాప్ చేసి, పారతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురు నిందితులు - అనూప్, చింతారామ్, క్షుద్ర పూజలు చేస్తున్న మాంత్రికుడిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఆదివారం తెలిపారు.
