మహిళా అధికారి స్నానం చేస్తుండగా... సహ అధికారి ఫోన్ లో వీడియో తీశాడు. కాగా... ఆ విషయాన్ని గమనించిన ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు  చేయడంతో... అతనిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మదురై సమీపంలోని చదురగిరిమలై ఆలయంలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మదురైలోని చదురగిరి సుందరమహాలింగ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం హిందూ దేవాదాయ శాఖ నిర్వహణలో ఉంది. ఇక్కడ గతవారం అమావాస్య ముగిసిన తర్వాత హుండీలోని కానుకలు లెక్కింపు జరిగింది. దీనికోసం ఓ మహిళా అధికారి అక్కడికి వచ్చారు. ఆమె దేవాలయం దగ్గర వీఐపీలు ఉండే వసతి గృహంలో బస చేశారు.

కాగా.. ఆమె ఉన్న గదిలో, బాత్రూమ్ లో పురుషుల దుస్తులు ఉన్నాయి. వాటిలో సీక్రెట్ గా వీడియో చిత్రీకరించేలా కెమేరాలు ఉన్నాయి. వాటిని చూసి అనుమానం వచ్చిన ఆమె.. పరిశీలించగా షాక్ కి గురైంది. వెంటనే ఆమె చెన్నైలోని హిందూ దేవాదాయ శాఖ అధికారికి, మదురై డీఐజీకి ఫిర్యాదు చేశారు. డీఐజీ ఆదేశాల మేరకు పేరైయూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 విచారణలో మహిళా అధికారి ఉన్న గదికి పక్క గదిలో ఉన్న హిందూ దేవాదాయ శాఖ జోనల్‌ జాయింట్‌ కమిషనర్‌ పచ్చయప్పన్‌ ఈ పని చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు పచ్చయప్పన్‌ను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.