Asianet News TeluguAsianet News Telugu

నా కూతురికి పెళ్లి ఎలా చేయాలి..? ఓ తండ్రి ఆవేదన

ఇప్పుడు పెళ్లి చేయడానికి నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. ఒకవేళ ఆ పంటంతా అమ్మి ఉంటే నాకు రూ.2లక్షలు చేతికి వచ్చేవి. పెళ్లి జరుగుతుందో లేదోనని నా కూతురు కూడా కంగారుపడుతోంది

how will i get my daughter marriage now? kerala farmer emotional
Author
Hyderabad, First Published Aug 20, 2018, 4:24 PM IST

కనీవినీ ఎరగని రీతిలో భారీ వర్షాలు.. కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకక చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది పంట పొలాలు, ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో.. ఉన్న కాస్తో, కూస్తో ఆస్తి కూడా పోగొట్టుకున్నామంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా ఆస్తి పొగొట్టుకున్న ఓ రైతు.. తన కూతురి వివాహం ఎలా చేయాలి అంటూ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు.

వాయనాడ్‌ జిల్లాలోని పనమార ప్రాంతానికి చెందిన హ్యారిస్‌ కుమార్తెకి పెళ్లి కుదిరింది. సెప్టెంబర్‌ 9న పెళ్లి నిశ్చయమైంది. చుట్టాలందరికీ శుభలేఖలు పంచేశారు. ఇంతలో వరుణుడు కేరళలో బీభత్సం సృష్టించేశాడు. దాంతో అతని ఇల్లు పూర్తిగా జలమయమైపోయింది. అధికారులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో తన కుమారుడి ఇంటికి చేరుకోగలిగారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టాక తన ఇల్లు, పొలాల పరిస్థితి ఎలా ఉన్నాయో చూసుకుందామని వెళ్లాడు.

తీరా వెళ్లి చూసేసరికి ఇంట్లో దాచిన ధాన్యం అంతా తడిసిపోయింది. పొలాల్లోకి బురద వచ్చి చేరింది. అది చూసిన హ్యారిస్‌ ఎంతో కుమిలిపోయాడు. స్థానిక మీడియా వర్గాల ద్వారా తన బాధను చెప్పుకున్నాడు. ‘సెప్టెంబర్‌లో నా బిడ్డ పెళ్లి ఉంది. అందరికీ శుభలేఖలు పంచేశాం. కానీ ఇప్పుడు మా ఇంట్లోని సామాన్లతో పాటు చేతికి వచ్చిన పంట కూడా తడిసిపోయింది. శనివారం ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మాలనుకున్నాం. ఇంతలో వర్ష తీవ్రత ఎక్కువైంది. దాంతో వాటిని ఇంట్లో దాచి మా అబ్బాయి ఇంటికి వెళ్లాం. తీరా వచ్చి చూసేసరికి గింజలన్నీ నానిపోయాయి. ఇప్పుడు పెళ్లి చేయడానికి నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. ఒకవేళ ఆ పంటంతా అమ్మి ఉంటే నాకు రూ.2లక్షలు చేతికి వచ్చేవి. పెళ్లి జరుగుతుందో లేదోనని నా కూతురు కూడా కంగారుపడుతోంది’ అని ఉద్వేగానికి లోనయ్యాడు హ్యారిస్.
 

Follow Us:
Download App:
  • android
  • ios