చెన్నై: యావత్ ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్లు వచ్చినప్పటికి ఈ వైరస్ ను సంపూర్ణంగా తరిమికొట్టలేకపోతున్నారు. అయితే ఇలా సాంకేతిక పద్దతుల్లో కాకుండా ఆద్యాత్మిక పద్దతిలో ఈ మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యపడుతుందంటూ రాజగురు బ్రహ్మశ్రీ గురువాయూర్‌ సూర్యన్‌ నంబూద్రి స్వామి పేర్కొన్నారు.

కరోనా వ్యాధి వ్యాప్తికి ఇంద్రాది దేవతల ఆగ్రహమే కారణమని నంబూద్రి స్వామి పేర్కొన్నారు. అయితే ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఓ మార్గం వుందని... అదే ధరణి రక్ష మహా యాగమని అన్నారు. ఈ యాగం చేస్తే భారత దేశాన్నే కాదు యావత్ ప్రపంచ మానవాళిని కాపాడవచ్చని అన్నారు. 

read more   ఇండియాలో కరోనా కల్లోలం: ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు, మరణాల నమోదు

ఈ ధరణి రక్ష యాగం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని... అందువల్లే ఆర్థిక సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం పళనిస్వామికి లేఖ రాసినట్లు తెలిపారు. అలాగే దేశంలోని  పలువురు ప్రముఖ పీఠాధిపతులకు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరానన్నారు. అయితే తన అభ్యర్ధనపై ఎవరూ స్పందించలేదని నంబూద్రి స్వామి తెలిపారు. 

హిందూ పరిరక్షణే ధ్యేయమని చెప్పుకునే ప్రధాని మోదీ కూడా తన లేఖకు స్పందించలేదని విమర్శించారు. స్వలాభం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యాగాలు చేయించే వాళ్లు దేశ ప్రజల కోసం తాను తలపెట్టిన ధరణి రక్ష యాగానికి సహకరించకపోవడం శోచనీయమని నంబూద్రి స్వామి అన్నారు.