తమిళనాడులో  అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల గవర్నర్ ఆర్ఎన్‌ రవికి వ్యతిరేకంగా కొన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో తమిళనాడు గవర్నర్‌గా మర్రి చెన్నారెడ్డి  కాన్వాయ్‌పై అన్నాడీఎంకే కార్యకర్తలు జరిపిన దాడి తెరపైకి వచ్చింది.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. తాజాగా నీట్‌ బిల్లు విషయంలో గవర్నర్ తీరును సీఎం స్టాలిన్‌తో పాటు ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్రంలో నీట్‌ పరీక్షకు బదులుగా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి సొంత ఎంట్రన్స్‌ నిర్వహించేందుకు వీలు కల్పించే బిల్లును ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసి రెండోసారి పంపినప్పటికీ గవర్నర్‌ రవి దానిని తిరస్కరించారు. ఈ క్రమంలోనే ఇటీవల గవర్నర్ ఆర్ఎన్‌ రవికి వ్యతిరేకంగా కొన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించారు. 

గవర్నర్ వెళ్తున్నమార్గంలో ఈ రకంగా నిరసన తెలుపడాన్ని బీజేపీతోపాటు ప్రతిపక్ష అన్నాడీఎంకే తప్పుబట్టింది. అయితే దీనిపై అసెంబ్లీలో స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్.. గవర్నర్‌కు తగిన రక్షణ, భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాజీపడదు అని స్పష్టం చేశారు. గవర్నర్‌కు రక్షణ కల్పించేందుకు సెంట్రల్ రీజియన్ ఐజీ, ఇద్దరు డీఐజీలు, ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 21 మంది డీఎస్పీలు, 54 మంది ఇన్‌స్పెక్టర్లు, 102 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 1,120 మంది కానిస్టేబుళ్లతో కూడిన పోలీసు బృందం విధులు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

అయితే ఈ సందర్భంగా గతంలో అన్నాడీఎంకే హయాంలో చోటుచేసుకున్న పలు ఘటనలను స్టాలిన్ గుర్తుచేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. 1995లో అప్పటి గవర్నర్ చెన్నారెడ్డికి ఏం జరిగిందో గుర్తుచేశారు. గవర్నర్, ఆయన కాన్వాయ్ దాదాపు 15 నిమిషాలకు పైగా వేచి ఉండాల్సి వచ్చిందని.. తిండివనంలో ఆందోళనకారులు కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నారని స్టాలిన్ అన్నారు. నలుగురు ఎమ్మెల్యేల నేతృత్వంలో నిరసనకారులు రాళ్లు, కోడిగుడ్లు, టమోటాలు విసిరి గవర్నర్‌ను అవమానించారని చెప్పారు. చెన్నా రెడ్డి దాడుల నుంచి సురక్షితంగా బయటపడం హెడ్‌లైన్‌గా మారిందన్నారు. 

అసలు చెన్నారెడ్డి గవర్నర్‌గా ఏం జరిగింది...
మర్రి చెన్నారెడ్డి 1993లో తమిళనాడు 17వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జయలలిత వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులు గవర్నర్, సీఎంల మధ్య మంచి వాతావరణమే ఉన్నప్పటికీ.. కొద్ది కాలంలోనే విభేదాలు తెరపైకి వచ్చాయి. 1993 ఆగస్టులో చెన్నైలోని ఆర్ఎస్‌ఎస్ ప్రధాన కార్యాయంపై జరిగిన బాంబు పేలుడు గురించి వెంటనే తనకు తెలియజేయడంలో రాష్ట్ర పరిపాలన వైఫల్యంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో విభేదాలు తలెత్తినట్టుగా చెబుతారు. 

ఆ తర్వాత 1993 సెప్టెంబరులో పళని లోక్‌సభ, రాణిపేట అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నిక సందర్భంగా శాంతిభద్రతలపై తనకు నేరుగా నివేదిక సమర్పించాలని చెన్నారెడ్డి.. అప్పటి చీఫ్ సెక్రటరీ టీవీ వెంకటరామన్‌ను ఆదేశించారు. దీంతో జయలలిత కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సోమసుందరం.. చెన్నారెడ్డి సూపర్ ముఖ్యమంత్రిగా పనిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక, మద్రాస్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ పదవికి సిఫార్సు చేసిన పేర్లను చెన్నారెడ్డి తిరస్కరించడం వివాదానికి దారితీసింది. దీంతో వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ తర్వాత రెండేళ్లు జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్, సీఎం మధ్య కోల్డ్ వార్‌ను బహిరంగంగానే ప్రదర్శించడానికి వేదికలుగా మారాయని అంటారు. 

గవర్నర్ నిర్వహించే సంప్రదాయ తేనేటి విందు జయలలిత పార్టీ బహిష్కరించింది. ఈ క్రమంలోనే చెన్నారెడ్డిని రీకాల్ చేయాలని జయలలిత ఒకటి కంటే ఎక్కువసార్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆ డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.

1995లో కీలక పరిణామం..
అయితే 1995 మార్చిలో తమిళనాడు స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ భూమి కొనుగోలు, బొగ్గు దిగుమతులకు సంబంధించి కేసుల విషయంలో జయలలితను ప్రాసిక్యూట్ చేయడానికి చెన్నారెడ్డి అనుమతి మంజూరు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల తర్వాత తిండివనం వద్ద చెన్నారెడ్డి వాహన శ్రేణిని అన్నాడీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు.గుడ్లు, రాళ్లు, బూట్లు విసిరారు.

ఇదిలా ఉంటే.. 1993 సెప్టెంబర్ లాతూర్‌‌ భూకంపం సంభవించినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు సేకరించడానికి బదులుగా తన స్వంతంగా నిధుల సేకరణ ప్రచారానికి వెళ్లడాన్ని అన్నాడీఎంకే విమర్శించింది. దేశ రాజధాని ఢిల్లీలో అన్నాడీఎంకే పనితీరును విమర్శించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే పరిస్థితుల్లో పెనుమార్పు చోటుచేసుకుంది. 1995 సెప్టెంబర్‌లో చెన్నారెడ్డి, జయలలిత మధ్య సత్సబంధాలు ఏర్పడ్డాయనే సంకేతాలు వెలువడ్డాయి. 1996 రిపబ్లిక్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి గవర్నర్‌కు సుహృద్భావ వాతావరణంలో స్వాగతం పలికారు. ఇది గత రెండు రిపబ్లిక్ డే వేడుకలతో పోల్చితే చాలా భిన్నమైనది. ఇక, ఆ ఏడాది పిబ్రవరిలో అసెంబ్లీలో తన ప్రసంగంలో.. జయలలిత స్పూర్తిదాయకమైన నాయకత్వాన్ని చెన్నారెడ్డి ప్రశంసించారు. 1996లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. మే నెలలో కరుణానిధి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కొన్ని నెలల పాటు చెన్నారెడ్డి.. కరుణానిధితో కలిసి పనిచేశారు. ఇక, 1996 డిసెంబరులో తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సమయంలో చెన్నారెడ్డి మరణించారు.