మీ రాజకీయ లబ్ది కోసం రాముడిని ఎన్ని సార్లు వాడుకుంటారు ? - బీజేపీకి కపిల్ సిబల్ సూటి ప్రశ్న
శ్రీరాముడిని బీజేపీ ఎన్నిసార్లు వాడుకుంటుందని రాజ్యసభ సభ్యుడు, ఇన్సాఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. రాముడిని ఎన్నిసార్లు వాడుకున్నా.. ఆయన సుగుణాలను ఆ పార్టీ పాటించడం లేదని విమర్శించారు.
రాముడిని బీజేపీ రాజకీయ లబ్ది కోసం వాడుకుంటోందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఆరోపించారు. రాముడిని వాడుకుంటన్నప్పటికీ.. ఆ పార్టీ పాలనలో ఆయన సద్గుణాలు కనిపించడం లేదని విమర్శించారు. అయోధ్యలో రాముడి కోసం భారీ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న మరుసటి రోజే కపిల్ సిబల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అయోధ్యలోని రామాలయంలోకి త్వరలోనే శ్రీరాముడు రాబోతున్నారు. వచ్చే రామనవమి సందర్భంగా ఆలయంలో ప్రార్థనలు యావత్ ప్రపంచానికి ఆనందం కలిగిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) లో ఓ పోస్టులో పేర్కొన్నారు. అందులో ప్రధాని తన ప్రసంగం వీడియో కూడా విడుదల చేశారు. అయితే దీనికి కపిల్ సిబల్ స్పందిస్తూ బుధవారం ఎక్స్ లో పోస్టు పెట్టారు.
అందులో ‘‘బీజేపీ.. రాజకీయ లబ్ది కోసం రాముడిని ఎన్నిసార్లు వాడుకుంటారు? కానీ మీరు రాముడి సద్గుణాలను ఎందుకు స్వీకరించరు ? ఆయన శౌర్యం, ధైర్యసాహసాలు, విధేయత, కరుణ, ప్రేమ, విధేయత, ధైర్యసాహసాలు, సంసిద్ధ వంటి ఈ సుగుణాలేవీ మీ పాలనలో కనిపించడం లేదు!’’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా.. యూపీఏ-1, 2 సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గత ఏడాది మేలో కాంగ్రెస్ పార్టీని వీడారు. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో ఆయన 'ఇన్సాఫ్' అనే నాన్ ఎలక్టోరల్ ప్లాట్ ఫారమ్ ను ప్రారంభించారు. ఇప్పుడు దానికి చీఫ్ గా కొనసాగుతున్నారు. అనేక సందర్భాల్లో బీజేపీని విమర్శిస్తూ పోస్టులు పెడుతారు.