బెంగాల్‌లో వామపక్షానికి పెరిగిన ఓటు షేర్.. కారణమేంటని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నించిన అమిత్ షా.. జవాబిదే!
పశ్చిమ బెంగాల్‌లో వామపక్షానికి ఓటు షేర్ ఎలా పెరిగిందని కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. స్థానిక ర్యాలీలపై ఫోకస్ పెట్టాలని, వచ్చే ఏడాది 24 ర్యాలీలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ లెఫ్ట్‌కు ఓటు షేర్ పెరడంపై బీజేపీ ఆందోళన చెందుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2021లో జరిగిన మున్సిపల్ పోల్స్‌లో వామపక్షానికి ఓట్లు అధికంగా పడ్డాయి. బెంగాల్‌లో లెఫ్ట్‌కు ఎందుకు ఓటు షేర్ పెరుగుతున్నదని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆరా తీస్తున్నది. తాజాగా బెంగాల్ బీజేపీ నేతలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ఇందుకు కారణాలు ఏమిటని ఆయన అడిగారు. అంతేకాదు, క్షేత్రస్థాయిలో బీజేపీ ఓటర్లను పెంచుకోవడానికి లోకల్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.
ఇప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో జిల్లా స్థాయి ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్‌లు వేస్తున్నది. వచ్చే ఏడాదిలో 29 జిల్లా స్థాయి బహిరంగ ర్యాలీలను బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో ఐదు మెగా ర్యాలీలు నిర్వహించనుంది. వీటికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం బంగాల్ బీజేపీ సభ్యులతో మాట్లాడారు. లెఫ్ట్ ఓటు షేర్‌ను పెంచుకోవడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. చిన్న చిన్న ర్యాలీలపై ఫోకస్ పెట్టాలని ఆయన పార్టీ సభ్యులకు తెలిపారు. 2019లో బీజేపీ ఘోర పరాజయాన్ని నమోదు చేసిన 24 స్థానాలను టార్గెట్ చేసినట్టు బెంగాల్ బీజేపీ నేత ఒకరు చెప్పారు. ఈ ఏరియాల్లో ఆరుగురు కేంద్ర మంత్రులు పని చేస్తున్నారని, అంతేకాదు, ఈ నియోజకవర్గాల్లోనే వచ్చే 12 నెలల్లో 24 ర్యాలీలు నిర్వహిస్తారని వివరించారు. ఇందులో 12 ర్యాలీల్లో అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగాలు చేస్తారని తెలిపారు.
Also Read: బెంగాల్ ఎవరికీ తలవంచదు.. మానవత్వం, ఐక్యత, సమగ్రత కోసం పోరాడుతుంది : సీఎం మమతా బెనర్జీ
ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. సీపీఎం పార్టీకి ఓట్ల శాతం పెరగడాన్ని అడగ్గా.. దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, కొన్ని చోట్ల సీపీఎం ఇప్పటికీ బలాన్ని కలిగి ఉన్నదని వివరించారు. అయితే అవి కేవలం పంచాయత్ పోల్స్‌లో మాత్రమే పార్టీకి కలిసిరావొచ్చని, అంతకు మించి పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని తెలిపారు. అలాగే, టీఎంసీ పార్టీపై భ్రమలు తొలగిపోయిన కొన్ని మైనార్టీ వర్గాలు లెఫ్ట్ వైపు మొగ్గి ఉంటాయని ఇంకొందరు బీజేపీ నేతలు చెప్పారు.
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పోల్స్‌లో 144 వార్డుల్లో 65 వార్డుల్లో బీజేపీ కంటే లెఫ్ట్ మంచి ప్రదర్శన ఇచ్చింది.