Asianet News TeluguAsianet News Telugu

Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుంది?.. ఈ విషయాలు మీకు తెలుసా..?

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ ఏడాది జూలై 24తో ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ జారీచేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఎలా సాగుతుందో ఒకసారి తెలుసుకుందాం..

How is the president of India Election Process conducted full details here
Author
First Published Jun 21, 2022, 7:31 PM IST

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ ఏడాది జూలై 24తో ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జూలై 18న జరగనుండగా.. జూలై 21 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం, విపక్షాలు ఎన్నికల్లో గెలుపు కోసం వ్యుహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఒకసారి తెలుసుకుందాం..

దేశానికే అత్యున్నత వ్యక్తి..
ఆర్టికల్ -52 ప్రకారం భారతదేశానికి రాష్ట్ర‌ప‌తి ఉంటారు. ఆయనే దేశంలో అత్యున్నత వ్యక్తి. ఆర్టికల్-53 ప్రకారం.. రాష్ట్ర‌ప‌తి  రాజ్యాంగ అధినేత, ప్రధాన కార్యనిర్వాహక అధికారి, దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. ఆర్టికల్ 53(1) ప్రకారం భారతదేశ కార్యనిర్వహణ మొత్తం రాష్ట్ర‌ప‌తికే అప్పగించారు. ఆయనకు సహాయపడేందుకు ఆర్టికల్ 74(1) ప్రకారం ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది.

పదవీ కాలం.. 
రాష్ట్ర‌ప‌తి పదవీ కాలం ఐదేళ్లు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర‌ప‌తితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన లేనట్లయితే సీనియర్ న్యాయమూర్తి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్ర‌ప‌తిగా కొనసాగేందుకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి తప్పుకోవచ్చు. రాజీనామా లేఖను ఉప రాష్ట్ర‌ప‌తికి సమర్పించాలి. ఉపరాష్ట్ర‌ప‌తి కనుక లేనట్లయితే ఒక ప్రతిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మరో ప్రతిని ప్రధానమంత్రికి అందించాలి. ఒక వ్యక్తి రాష్ట్ర‌ప‌తి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. 

పోటీ చేయడానికి అర్హతలు..
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. పోటీ చేయాల్సిన అభ్యర్థులు నోటిఫికేషన్ గడువు తేదీ ముగిసేలోపు.. నామినేషన్ దాఖలు చేయాలి. పోటీచేసే అభ్యర్థులు భారతీయ పౌరుడై ఉండాలి. 35 ఏళ్లు నిండి ఉండాలి.  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఎటువంటి సంస్థ‌ల్లో కూడా ప‌ద‌విలో ఉండ‌కూడ‌దు. లోక్‌సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి. అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది సభ్యులు బలపరచాలి. అభ్యర్థి రూ. 15,000 మొత్తాన్ని సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ఎవరు ఎన్నుకుంటారు..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 55 ప్రకారం.. పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల శాసనసభలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కళాశాల ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. 1971 నాటి జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం ఎల‌క్టోర‌ల్ కాలేజీలో4,896 మంది స‌భ్యులు ఉన్నారు. వీరిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది పార్లమెంటు సభ్యులు (543 లోక్‌సభ ఎంపీలు, 233 రాజ్యసభ ఎంపీలు). ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,86,431 ఓట్లు ఉన్నాయి. ప్రతి ఓటర్ల ఓటు (MP/MLA) ముందుగా నిర్ణయించిన విలువను కలిగి ఉంటుంది. అయితే ఎమ్మెల్సీలకు, నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. 

రాష్ట్ర‌ప‌తి ఎన్నికకు 1971 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటున్నారు. పార్లమెంట్ సభ్యుల ఓటు విలువ 708గా నిర్ణయించబడుతుంది. అయితే అయితే ఈసారి జమ్మూ కాశ్మీర్‌లో శాసనసభ లేకపోవడంతో జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుని ఓటు విలువ 708 నుంచి 700కి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ ఒకేలా ఉండదు. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలోని జనాభా (1971 జనాభా లెక్కల ఆధారంగా)తో కూడిన ఫార్ములా ద్వారా ఈ విలువ నిర్ణయించబడుతుంది. అందువల్ల ఈ విలువ ప్రతి రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది.

ఉత్తరప్రదేశ్‌లో అధికంగా ఓటు విలువ..
ఒక రాష్ట్రంలోని మొత్తం జ‌నాభా( 1971 నాటి జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం )ను ఆ రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య‌తో భాగించాలి. అలా వ‌చ్చిన సంఖ్య‌ను 1000తో భాగిస్తే వ‌చ్చే సంఖ్య‌ను ఆ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ‌గా నిర్ణ‌యిస్తారు. ఉదాహరణకు, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఎమ్మెల్యే.. అన్ని రాష్ట్రాలలోకెల్లా అత్యధికంగా 208 విలువను కలిగి ఉంటారు. 403 మంది ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేల మొత్తం విలువ 83,824. రాష్ట్రానికి చెందిన 80 మంది ఎంపీల మొత్తం ఓట్ల విలువ 56,640. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల మొత్తం విలువ 1.4 లక్షలకు చేరి, వారికి దాదాపు 12.7 శాతం వెయిటేజీ ఇస్తోంది.  చిన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఓటు విలువను పరిశీలిస్తే.. పంజాబ్‌లో ఎమ్మెల్యే ఓటు విలువ 118 (మొత్తం ఎమ్మెల్యేల విలువ 13,572), ఉత్తరాఖండ్‌లో ఎమ్మెల్యే ఓటు విలువ 64 (మొత్తం ఎమ్మెల్యేల విలువ 4,480), గోవాలో ఎమ్మెల్యే ఓటు విలువ 20 (మొత్తం ఎమ్మెల్యేల విలువ 800)

ఓటింగ్ ప్రక్రియ..
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు సాధార‌ణ ఎన్నిక‌ల మాదిరి కాకుండా proportional representation (దామాషా ప్రాతినిధ్య) ప‌ద్ధ‌తిలో సింగిల్ ట్రాన్స్‌ఫ‌ర‌బుల్ ఓటింగ్ విధానంలో జ‌రుగుతాయి. ఈ విధానంలో ఒక‌రికంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రాధాన్య‌తా క్ర‌మంలో అభ్య‌ర్థులు ఓటు వేస్తారు. బ్యాలెట్ పేపర్‌లో ఎలాంటి ఎన్నికల గుర్తు ఉండదు. బ్యాలెట్ పేపర్‌పై రెండు కాలమ్‌లు ఉంటాయి. మొదటి నిలువు వరుసలో అభ్యర్థుల పేరు ఉంటుంది. రెండవ నిలువు వరుస ప్రాధాన్యత క్రమాన్ని కలిగి ఉంది.

ఒక‌వేళ ఈ ఎన్నిక‌లో ముగ్గురు పోటీ చేశార‌ని అనుకుందాం.. అప్పుడు మ‌న ప్రాధాన్య‌త ప్ర‌కారం ఒక్కొక్క‌రికీ ఒక్కో ర్యాంకు కేటాయించాల్సి ఉంటుంది. అలా తొలి ప్రాధాన్య‌త‌, రెండు, మూడు, నాలుగో ప్రాధాన్య‌త ఓట్లు వేయాల్సి ఉంటుంది. 

ఓటు చెల్లుబాటు కావాలంటే..
బ్యాలెట్ పత్రాలు రెండు రంగులలో ముద్రించబడతాయి. పార్లమెంటు సభ్యుల ఉపయోగం కోసం ఆకుపచ్చ రంగులో, రాష్ట్ర అసెంబ్లీల సభ్యుల ఉపయోగం కోసం గులాబీ రంగులో ఉంటాయి. ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్‌ చేయాలి. ఇతర ప్రాధాన్యతలను గుర్తించడమనేది ఎలక్టోరల్ సభ్యుల ఐచ్చికం.తొలి ప్రాధాన్యత సంఖ్య వేయకుండా.. ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు రద్దు అవుతుంది. పోలింగ్ సందర్భంగా ఈసీ ఇచ్చే పెన్నును మాత్రమే బ్యాలెట్‌పై వినియోగించాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో నోటాకు అవకాశం లేదు.

రిటర్నింగ్ అధికారి ఎవరు..?
సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ఎన్నికకు.. లోక్‌సభ సెక్రటరీ జనరల్ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ ద్వారా రిటర్నింగ్ అధికారిగా నియమింపబడతారు. 2022 రాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. 

ఎక్కడ పోలింగ్ నిర్వహిస్తారు..?
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఒక గది, ఢిల్లీ, పుదుచ్చేరిలతో సహా ప్రతి రాష్ట్రంలోని శాసనసభల సెక్రటేరియట్ భవనంలో ఒక గదిని.. సాధారణంగా ఎన్నికల సంఘం ద్వారా పోలింగ్ స్థలాలుగా నిర్ణయించబడతాయి. 

నచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చు..
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. సభ్యులు వారిక నచ్చినట్లు ఓటు వేసే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు విప్ జారీ చేయడానికి లేదు.

విజేతను ఎలా డిసైడ్ చేస్తారంటే..
ఓటింగ్ ముగిసిన వెంటనే పోలింగ్ బాక్స్‌లను పార్లమెంట్‌లోని ఎన్నికల కార్యాలయానికి చేర్చాలి ఉంటుంది. అక్కడ పోలైన మొత్తం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రతి అభ్యర్థి పోల్ చేసిన ఓట్ల మొత్తం విలువను లెక్కించిన తర్వాత, రిటర్నింగ్ అధికారి పోలైన అన్ని చెల్లుబాటు అయ్యే ఓట్ల విలువను జోడిస్తారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్లు కాదు. ఒక నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఈ కోటాను నిర్ణయించేందుకు పోలైన వ్యాలిడ్ ఓట్లను 2తో భాగిస్తారు. ఫలితంగా వచ్చే సంఖ్యకు ఒకటి యాడ్ చేస్తారు. ఉదాహరణకు.. ఎలక్టోరల్ సభ్యులు పోల్ చేసిన చెల్లుబాటు అయ్యే ఓట్ల మొత్తం విలువ 1,00,000 అని అనుకుందాం. అప్పుడు ఎన్నిక కావడానికి అవసరమైన కోటా కోసం.. 1,00,000ని 2తో భాగించి.. వచ్చిన ఫలితానికి ఒకటి కలపుతారు. అంటే నిర్దేశిత కోటా.. 50,000 + 1 = 50,001 అవుతుంది.

ఈ విధానంలో ఒక అభ్యర్థికి తొలి ప్రాధాన్యత ఓట్లు.. నిర్దేశించిన కోటా కంటే ఎక్కువ వస్తే ఆ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటిస్తారు. లేదంటే మళ్లీ లెక్కింపు మొదలుపెడతారు. తొలి ప్రాధాన్య ఓట్లు అత్యంత తక్కువ పొందిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగించి.. ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతారు. అప్పుడు ఎవరైతే నిర్దేశించిన కోటా కంటే ఎక్కువ ఓట్లు పొందుతారో వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. లేదంటే ఇంతకు ముందు పద్ధతిలో మళ్లీ కౌంటింగ్ చేపడతారు. ఇలా ఎవరో ఒక అభ్యర్థి గెలిచే వరకు లెక్కింపు జరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios