ఉజ్జయిని: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే ఎలా పోలీసులకు చిక్కాడనే విషయం ఆసక్తికరంగా మారింది. అతను పోలీసులకు లొంగిపోయాడా, అరెస్టయ్యాడా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఉజ్జయిని ఆలయం సెక్యూరిటీ గార్డు లఖన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.

వెనక నుంచి ఆలయంలోకి ప్రేవశిస్తుండగా గుర్తించినట్లు, వెంటనే పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. తమ వద్ద వికాస్ దూబే ఫొటో ఉందని, అతను పూజలు చేయడానికి ఆలయానికి వచ్చి ఉంటాడని భావించామని ఆయన చెప్పారు. రెండు గంటల పాటు తాము అతని గురించి విచారించామని, ఆ తర్వాత తమ శాఖ అధికారులకు తెలియజేశామని ఆయన చెప్పారు 

తాము వికాస్ దూబేను సెక్యూరిటీ గార్డు కెమెరా ఫుటేజీలో చూశామని, ఉదయం 7 గంటలకు అతను తమకు కనిపించాడమని, అతను ఆలయంలోకి ప్రవేశించలేదని, ఒంటరిగా ఉన్నప్పుడు తాము గమనించామని ఆయన చెప్పారు. లఖన్ యాదవ్ తో కూడిన ఎనిమిది మంది సెక్యూరిటీ గార్డులు వికాస్ దూబేను గుర్తించారు. 

ఉజ్దయినిలో అరెస్టు చేసిన అతన్ని దాదాపు డజను మంది పోలీసులు తీసుకుని వెళ్తుండడం విజువల్స్ లో కనిపించింది. నకిలీ ఐడి ద్వాార రాజస్థాన్ లోని కోట మార్గంలో ఉజ్జయినికి వికాస్ దూబే రోడ్డు మార్గంలో చేరుకున్నట్లు చెబుతున్నారు. 

మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ పథకం ప్రకారం లొంగిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వికాస్ దూబేపై దాదాపు 60 కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు వికాస్ దూబేది అరెస్టుగా చూపుతున్నారు. ఎనిమిది మంది పోలీసులను చంపిన తర్వాత వికాస్ దూబే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తన గ్రామం నుంచి ఈ నెల 3వ తేదీన పారిపోయాడు. చివరకు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చేరుకున్నాడు. 

వికాస్ దూబే ఈ నెల 7వ తేదీన ఫరిదాబాదులో కనిపించాడు. అయితే, అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఉజ్జయినికి చేరుకున్నాడు. తన గ్రామం నుంచి పారిపోయిన వికాస్ దూబే ఢిల్లీ లేదా నోయిడాకు సమీపంలోని నగరాలకు చేరుకుని ఉంటాడని అనుమానించారు. నోయిడా, గురుగ్రామ్, ఫరిదాబాదుల్లో ఎక్కడైనా ఉండవచ్చునని భావించారు. 

అనూహ్యంగా అతను గురువారంనాడు ఉజ్జయినిలో దర్శనమిచ్చాడు. సెక్యూరిటీ గార్డుకు తానెవరో చెప్పుకుని పోలీసులను పిలిచినట్లు తెలుస్తోంది. ఫరిదాబాద్ నుంచి ఉజ్జయిని 770 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి అంత దూరం అతను ఎలా ప్రయాణించాడనే ప్రశ్న ఉదయిస్తోంది. 

తనను అరెస్టు చేసిన వెంటనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే పెద్దగా అరిచాడు. మై వికాస్ దూబ్ హూ, కాన్పూర్ వాలా (నేను వికాస్ దూబేను, కాన్పూర్ కు చెందినవాడిని) అని తనను అరెస్టు చేసిన వెంటనే పెద్దగా అరిచాడు. దాంతో పోలీసు అధికారి అతని తల వెనక బాది అరవకు అని హెచ్చరించాడు. 

అయితే, మహంకాళి ఆలయం వద్ద పథకం ప్రకారం అతను పోలీసులకు లొంగిపోవడానికి ఏర్పాటు చేసుకున్నట్లున్నాడని యూపి డీజీపీ అరవింద్ కుమార్ అన్నారు. తనను తాను మహంకాళి సెక్యూరిటీ గార్డుకు పరిచయం చేసుకున్నాడని, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడని ఆయన చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ పోలీసులు తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని గ్రహించడంతో, తన అనుచరులు ముగ్గురు పోలీసులు కాల్పుల్లో హతం కావడంతో భయపడి వికాస్ దూబే మధ్యప్రదేశ్ లో పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. కొంత మంది పోలీసులతో, రాజకీయ నేతలతో వికాస్ దూబేకు పరిచయాలున్నాయి. 

వికాస్ దూబే అరెస్టును మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ధ్రువీకరించారు. కాన్పూర్ ఎన్ కౌంటర్ తర్వాత తమ పోలీసులు అప్రమత్తయ్యారని, వికాస్ దూబేను పట్టుకోవడానికి అది సాయపడిందని ఆయన అన్నారు. ఇద్దరు వికాస్ దూబే అనుచరులను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ లోని తన నివాసం వద్ద ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే వారం రోజుల తర్వాత పోలీసుల చేతికి చిక్కాడు. మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో అతను పోలీసులకు చిక్కాడు.