గాంధీనగర్: "గాంధీ"- భారతీయులెవ్వరికీ పరిచయం అక్కర్లేని పేరు. కేవలం భారతీయులకే కాదు ప్రపంచంలో భారతదేశం గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నవారికైనా పరిచయం అవసరం లేదు. మనదేశంలోనయితే చిన్నప్పటినుండి గాంధీ మహాత్ముని చరిత్రను పాఠ్యాంశాలుగా చదువుకుంటూనే ఉన్నాం. మహాత్మా గాంధీ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారనేది జగమెరిగిన సత్యం. 

ఇప్పుడెందుకు గాంధీ గురించి సందర్భం లేకుండా మాట్లాడకోవాల్సి వచ్చింది అని అనిపించొచ్చు. కానీ ఈ కథనాన్ని చదివితే మీకే అర్థమవుతుంది. 

"గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?" మరోసారి తిరిగి చదవాల్సిన అవసరం లేదు. మీరు చదివింది కరెక్టే. ఈ ప్రశ్న విద్యార్థులు ప్రశ్నాపత్రంలో ప్రత్యక్షమయింది. వివరాల్లోకి వెళితే, గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ లోని "సుఫలాంశాల వికాస్ సంకుల్" పేరుతో నిర్వహిస్తున్న పాఠశాలలో 9వతరగతి ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఈ ప్రశ్న ప్రత్యక్షమయింది. 

ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తున్నా ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయి. ఈ ఒక్క ప్రశ్నే కాకుండా మరో ప్రశ్న కూడా వివాదాస్పదంగా మారింది. 12వతరగతి ప్రశ్నాపత్రంలో "మీ ఏరియాలో మద్యం విక్రయాలను ఎలా పెంచాలో వివరిస్తూ జిల్లా పోలీసు అధికారికి లేఖ రాయండి" అనే ప్రశ్నను పొందు పరిచారు. 

గాంధీ పుట్టిన రాష్ట్రంలో ఆయన చరిత్రను తప్పుదోవపట్టించేలా ప్రశ్న ఉండడం, ఆయన స్మృత్యర్థం మద్యనిషేధం పాటించే రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ఎలా పెంచాలో వివరించమని అడగడం శోచనీయం. 

ఈ విషయమై స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. ఇలాంటి ప్రశ్నలు అడగడం క్షమించరాని పొరపాటని, తక్షణమే పాఠశాలపై, ప్రశ్నాపత్రం తయారు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు.