అమీన్ పూర్: కరోనా కష్టాల కారణంగా ఇంటిఅద్దె కట్టలేకపోయిన ఓ వితంతు మహిళతో అత్యంత దారుణంగా వ్యవహరించాడో ఇంటి యజమాని. మానవత్వాన్ని మరిచి ఒంటరి మహిళను అతి దారుణంగా చితకబాదడమే కాకుండా ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి చెట్టుకు కట్టేసి అవమానించాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

యూపీలోని అమీన్ పూర్ లో ఓ అద్దె ఇంట్లో శోభాదేవి అనే వితంతువు నివాసముంటోంది. భర్త చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఆమె ఒంటరిగా జీవిస్తోంది. అయితే ఇటీవల కరోనా కారణంగా కూలీ పనులకు వెళ్లలేకపోయిన ఆమె ఇంటి అద్దె కట్టలేకపోయింది. పలుమార్లు అద్దె డబ్బుల కోసం ఇంటి యజమాని ఆమెను వేధించాడు. 

నిన్న కూడా ఇలాగే ఇంటి అద్దె కట్టాలని యజమాని కోరగా ఆమె డబ్బులు లేవని తెలిపింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనయిన అతడు అత్యంత దారుణంగా వ్యవహరించాడు. శోభారాణికి కొందరు మహిళల సాయంతో బయటకు లాక్కుని వచ్చి ఇంట్లోని వస్తువులను కూడా రోడ్డుపై పడేశారు. అంతటితో ఆగకుండా మహిళను చెట్టుకు కట్టేసి చితకబాది అవమానించాడు. 

ఇలా మహిళపట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన అతడు చివరకు పోలీసుల రాకతో వెనక్కితగ్గాడు. స్థానికుల అందించిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మహిళను విడిపించారు. ఒంటరి మహిళపై దాడికి పాల్పడటమే కాదు అవమానించి ఇంటి యజమానిపై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.