తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరికొద్దిరోజుల్లో జైలు నుంచి విడుదలకానున్న సంగతి తెలిసిందే. అయితే విడుదల తర్వాత ఆమె ఎక్కడుంటారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అయితే శశికళ స్థానిక పోయెస్ గార్డెన్‌లోనే నివాసముండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం జయలలిత నివాసం ‘వేద నిలయం’ ఎదురుగా సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మితమవుతోంది.

ఈ నెల 27న బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు నుంచి శశికళ విడుదలవుతున్న నేపథ్యంలో అప్పటికి ఈ భవనం సిద్ధం కాకపోవచ్చు. దీంతో టీనగర్‌లో శశికళ బంధువుల ఇంటి ఎదురుగా మరో భవనాన్ని తాత్కాలికంగా ఎంపిక చేశారు.

అక్కడి నుంచే శశికళ తన కార్యకలాపాలు నిర్వహిస్తారని సమాచారం. శశికళ జైలు నుంచి విడుదలయ్యే రోజు వెయ్యి వాహనాలతో ర్యాలీగా వెళ్లి భారీగా స్వాగతం పలకాలని ఆమె సమీప బంధువు టీటీవీ దినకరన్‌ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అలాగే బెంగుళూరు నుంచి చెన్నై వరకూ అడుగడుగునా స్వాగత సత్కారాలు జరిగేలా ఏర్పాట్లు చేపట్టారు.

మరోవైపు చెన్నై నగరంలోని మెరీనా తీరంలో సిద్ధమవుతున్న జయలలిత స్మారక మందిరాన్ని ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.53 కోట్లతో స్మారక మందిరం నిర్మిస్తున్నారు.

అటు జయలలిత నివాస భవనం ‘వేద నిలయం’ను కూడా అదే రోజు ప్రారంభించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించారు. శశికళ జైలు నుంచి విడుదలయ్యే రోజునే ఈ రెండిటినీ ప్రారంభిస్తుండటం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు, శశికళ జైలులో స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న శశికళకు బుధవారం ఉదయానికి శ్వాసకోశ సమస్య తీవ్రమైంది.

మంగళవారం ఆమెకు జైలులోనే చికిత్స అందించినా.. రాత్రి పొద్దుపోయాక శ్వాసకోస సమస్య తలెత్తింది. చివరకు ఆమెను శివాజీనగర్‌లోని బౌరింగ్‌ లేడీ కర్జన్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తరలించారు.