న్యూఢిల్లీ: భారీ వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఈ వర్షం కారణంగా ఇప్పటివరకు ఇద్దరు మరణించారు.  వర్షంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద నీటిలో ఓ భవనం కొట్టుకుపోయింది.ఆదివారం నాడు ఉదయం నుండి ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షపు  నీటితో నిండిపోయింది.

ఇంకా రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో  ఏడు నుండి  8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.ఢిల్లీలోని ఐటీఓ ఏరియాలో భారీ వర్షాలతో ఓ ఇల్లు కొట్టుకుపోయింది. ఈ ఇంటిని ఖాళీ చేయాలని స్థానికులు ఈ భవనంలో ఉంటున్నవారికి చెప్పారు.

భారీ వర్షాలతో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై ఆప్ పై కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. కరోనా నివారణలో ప్రభుత్వ యంత్రాంగం కేంద్రీకరించినందున వర్షాలపై ఆలస్యంగా దృష్టి పెట్టినట్టుగా ఢిల్లీ మంత్రి మనోష్ సిసోడియా చెప్పారు.

ఇవాళ కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మింటో బ్రిడ్జి అండర్ పాస్ వద్ద నిలిచిపోయిన నీటితో బస్సులోనే చిక్కుకుపోయిన  బస్సు డ్రైవర్, కండక్టర్ ను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకే ఢిల్లీలో 74.8 మి.మీ వర్షపాతం నమోదైంది. 

ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదంపూర్, హిస్సార్, హన్సి, జింద్, గోహానా, గనౌర్, బరూత్, రోహ్ తక్, సోనిపట్, బాగ్ పాట్ గురుగ్రామ్,నోయిడా, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.