పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు.

పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పెళ్లి కుమార్తె మాజీ స్నేహితుడితో సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. వర్కాల ప్రాంతానికి చెందిన రాజు కూతురుకు పెళ్లి కుదిరింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు వర్కాలలోని శివగిరిలో రాజన్ కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులందరూ పెళ్లి వేడుకకు సంబంధించిన సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. 

పెళ్లి కూతురు మాజీ స్నేహితుడు జిష్ణుతో సహా నలుగురు సభ్యుల బృందం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆమె ఇంటి ముందుకి వచ్చి గొడవ సృష్టించడం ప్రారంభించారు. పెళ్లి కూతురుపై దాడి చేసేందుకు కూడా యత్నించారు. దీంతో ఆమె తండ్రి దుండగులను ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు దాడి చేయడంతో రాజు తలపై బలమైన గాయాలు తగిలాయి. రాజును వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో అతడు మృతిచెందాడు. ఆ వెంటనే నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టి అరెస్ట్ చేశారు. 

నివేదిక ప్రకారం.. జిష్ణు, రాజు కుమార్తె గతంలో ఒకరితో ఒకరి రిలేషన్‌లో ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. అయితే ఈ క్రమంలోనే జిష్ణు పగ పెంచుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ పగనే దాడికి దారితీసినట్లు తెలుస్తోంది. 

‘‘నలుగురు యువకులు కర్రలతో వచ్చి ముందుగా పెళ్లి కుమార్తెపై దాడి చేశారు. ఇది చూసిన ఆమె తండ్రి జోక్యం చేసుకున్నాడు. అతనిని దారుణంగా కొట్టారు. ఇది అతని మరణానికి దారితీసింది. నిందితుడు ఇంతకుముందు ఆ యువతికి ప్రపోజ్ చేశాడు. అయితే ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఆసక్తి చూపలేదు’’ అని ప్రాథమిక విచారణ తర్వాత పోలీసులు తెలిపారు.