ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు ఇక పై వినియోగదారులు కచ్చితంగా సర్వీస్ చార్జీ చెల్లించాలని డిమాండ్ చేయరాదు. ఫుడ్ బిల్లుతోపాటు సర్వీస్ చార్జీని బిల్లులో చేర్చి కట్టాలని ఒత్తిడి చేయరాదు. సర్వీసు చార్జీ చెల్లించడం పూర్తిగా వినియోగదారుడి స్వచ్ఛంద నిర్ణయం అని సీసీపీఏ సోమవారం స్పష్టం చేసింది. 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు ఇక మీదట బిల్లులోనే సర్వీస్ చార్జీ కలిపి వేయడాన్ని నిషేధించింది. సర్వీస్ చార్జీ ఇవ్వడం వినియోగదారుల అభీష్టానికే వదిలిపెట్టాలని ఆదేశించింది. ఫుడ్ బిల్స్‌లోనే సర్వీస్ చార్జీ వేసి కచ్చితంగా కస్టమర్లు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేయరాదని స్పష్టం చేసింది. ఒక వేళ ఈ నిబంధన అతిక్రమిస్తే వినియోగదారులు కంప్లైంట్ ఫైల్ చేయవచ్చని వివరించింది. ఈ మేరకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సోమవారం ఆదేశాలు వెలువరించింది.

హోటళ్లు, రెస్టారెంట్లలో విచక్షణారహితంగా సర్వీస్ చార్జీలు వేస్తున్నారని, సర్వీస్ చార్జీలు, టిప్‌ల పేరిట కస్టమర్ల జేబులు గుల్ల చేస్తున్నారని చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సరైన విధానాన్ని రూపొందించడానికి సీసీపీఏ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సర్వీస్ చార్జీ విధించడంపై గైడ్‌లైన్స్ రూపొందించింది. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం, హోటళ్లు, రెస్టారెంట్లు ఆటోమేటికల్‌గా సర్వీస్ చార్జీని బిల్లులో చేర్చరాదు. అంతేకాదు, ఇతర పేర్లతోనూ సర్వీస్ చార్జీని వసూలు చేయరాదు.

అలాగే, ఏ హోటల్ అయినా, రెస్టారెంట్ అయినా వినియోగదారుల నుంచి సర్వీస్ చార్జీ డిమాండ్ చేయరాదు. సర్వీస్ చార్జీ అనేది స్వచ్ఛందం అనే విషయాన్ని వారు వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి. వినియోగదారుల ఇష్టం మేరకే సర్వీసు చార్జీ చెల్లింపులు జరపాలని వివరించాలి.

ఈ సర్వీస్ చార్జీ ఆధారం చేసుకుని వినియోగదారుల ఎంట్రీపై ఆంక్షలు విధించరాదు. అలాగే, సర్వీస్ చార్జీని ఆధారం చేసుకుని సేవలను నిర్దారించరాదని సీసీపీఏ గైడ్‌లైన్స్ పేర్కొన్నాయి. 

సర్వీస్ చార్జీని ఫుడ్ బిల్లుతో యాడ్ చేసి.. అన్నింటికి కలిపి జీఎస్టీ తీసుకోరాదని వివరించింది.

ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ సర్వీస్ చార్జీని చేర్చితే కస్టమర్లు ఆ సంస్థను సంప్రదించి సర్వీస్ చార్జీని తొలగించాలని కోరవచ్చు. అంతేకాదు, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్) లో ఫిర్యాదు చేయవచ్చు. 1915 నెంబర్‌కు ఫోన్ చేసి లేదా ఎన్‌సీహెచ్ మొబైల్ యాప్‌లోనూ ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. కన్జ్యూమర్ కమిషన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు.