Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రవాదాన్ని సమర్థించే దేశానికి నీతులు చెప్పే అర్హత లేదు.. పాక్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన భారత్ !

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికపై పరోక్షంగా చైనా, పాకిస్థాన్ దేశాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ వేదికలను ఉగ్రవాద ఊతమిచ్చేవారిని రక్షించడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. అలాంటి దేశాలకు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఇతర దేశాలకు ప్రశ్నించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. 

Hosting Bin Laden, attacking Parliament.. Jaishankar slams Pak at UNSC
Author
First Published Dec 15, 2022, 1:05 PM IST

కొన్ని దేశాలు  ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు, కుట్రదారులను రక్షించేందుకు అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తున్నాయి. అలాంటి దేశాలకు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఇతర దేశాలకు సూచనలు ఇచ్చే అర్హత ఉందా?  అని  పరోక్షంగా చైనా, పాకిస్థాన్ దేశాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్‌ఎస్‌సి)లో బహిరంగ చర్చ సందర్భంగా ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై మరింత ఐక్య ప్రతిస్పందనతో కలిసి వస్తున్నాయనీ, కానీ.. కొన్ని దేశాలు ఉగ్ర కుట్రదారులను సమర్థించడానికి , రక్షించడానికి బహుపాక్షిక వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు.

ముఖ్యంగా ఉగ్రవాదులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలన్న ప్రతిపాదనను చైనా పలుమార్లు వీటో చేసింది. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యం ఇచ్చినందుకు పాకిస్థాన్ ను నిందించారు. అలాగే.. పార్లమెంటుపై దాడి కూడా ప్రస్తావించాడు.  కాశ్మీర్‌పై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలను అనుసరించి ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మాట్లాడుతూ..కాశ్మీర్ సమస్యను లేవనెత్తారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కొత్త శాశ్వత సభ్యులను చేర్చడం వలన ఐక్యరాజ్య సమితి(UN) సభ్య దేశాలలో చాలా వరకు భద్రతా మండలిలో ఉన్న సీట్ల సంఖ్య సంఖ్యాపరంగా తగ్గిపోతుంది. మనం అందరి సార్వభౌమ సమానత్వాన్ని అనుసరించాలి. ఆధిపత్యాన్ని కాదు. భద్రతా మండలి చురుకుగా పాల్గొనడం ద్వారా మన ప్రాంతంలోని ప్రధాన భద్రతా సమస్యలను సమర్థవంతంగా , శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చని పాకిస్థాన్ దృఢంగా విశ్వసిస్తోందని బిలావల్ భుట్టో చెప్పారు.  

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తగిన సమాధానం 

అనంతరం  భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.కె.జైశంకర్ స్పందిస్తూ.. చైనా, పాకిస్థాన్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి పాల్పడిన వారిని సమర్థించేందుకు.. వారికి సహాయం చేసేందుకు బహుముఖ వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

“బహుపాక్షికతను సంస్కరించే ఆవశ్యకతపై మేము ఈ రోజు దృష్టి పెడుతున్నాం. మేము సహజంగానే మా ప్రత్యేక అభిప్రాయాలను కలిగి ఉన్నాం. అయితే.. ఇది మరింత ఆలస్యం కాకూడదనే కన్వర్జెన్స్ కొనసాగుతోంది.  ఐక్యరాజ్య సమితి ప్రభావం.. కీలక సవాళ్లను ఎదుర్కోవడంలో దాని సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.అది మహమ్మారి, వాతావరణ మార్పు, విభేదాలు,  ఉగ్రవాదం కావచ్చు, ”అని జైశంకర్ అన్నారు.

”ఉత్తమ పరిష్కారాల కోసం శోధిస్తున్నప్పుడు.. సాధారణ బెదిరింపులను అంగీకరించరాదు.. ప్రపంచం ఆమోదయోగ్యం కానిదిగా భావించే వాటిని సమర్థించాలనే ప్రశ్న కూడా తలెత్తకూడదు. ఇది సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి ఖచ్చితంగా వర్తిస్తుంది.  ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యం ఇవ్వడం ,  పొరుగున ఉన్న పార్లమెంట్‌పై దాడి చేసిన దేశానికి నీతులు చెప్పే అర్హత లేదు’’ అని స్పష్టం చేశారు.  

 పాకిస్థాన్ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను జాబితా చేసేందుకు భారత్, అమెరికా పలు సందర్భాల్లో చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న చైనాను జైశంకర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వాతావరణ చర్య , వాతావరణ న్యాయం విషయంలో పరిస్థితి మెరుగ్గా లేదని విదేశాంగ మంత్రి అన్నారు. తగిన ఫోరమ్‌లో సంబంధిత సమస్యలను పరిష్కరించకుండా, దృష్టిని మళ్లించే , తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మనం చూశామని జైశంకర్ అన్నారు.

2001 డిసెంబరు 13న భారత పార్లమెంట్‌పై పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే.. బిన్ లాడెన్ 21 సంవత్సరాల క్రితం న్యూయార్క్‌లోని సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఒక దశాబ్దం క్రితం పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో యునైటెడ్ స్టేట్స్ అతన్ని ఎలిమినేట్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios