నిలువ నీడ లేదని ఓ ఆసుపత్రి ప్రాంగణంలో తలదాచుకున్న పాపానికి ఓ 80 ఏళ్ల వృద్ధురాలిని సెక్యూరిటీ గార్డు చితకబాదాడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూపిణి నెహ్రూ ఆసుపత్రి ట్రామా సెంటర్ వెలుపల ఓ 80 ఏళ్ల వృద్ధురాలు పడుకొని వుంది.

ఇది గమనించిన సెక్యూరిటీ గార్డు సంజయ్ మిశ్రా ఆమెపై దాడికి దిగాడు. కాలితో, చెత్తో  ఏమాత్రం కనికరం లేకుండా చితకబాదాడు. ఆ పెద్దావిడ నొప్పికి తాళలేక సాయం కోసం కేకలు పెట్టింది.. ఆ సమయంలో అక్కడే వున్న ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి చోద్యం చూస్తున్నారు కానీ ఈ దారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సదరు ఆసుపత్రి యాజమాన్యం వృద్ధురాలిని అక్కడే చేర్చుకుని వైద్యం అందించడంతో పాటు ఘటనకు బాధ్యుడైన సెక్యూరిటీ గార్డు సంజయ్ మిశ్రాను విధుల నుంచి తప్పించింది.

అంతేకాకుండా అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని ఆసుపత్రి యాజమాన్యం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ ఘటనపై లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం శోచనీయమన్నారు. అతనికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.