Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. బైక్ పై కూలిన మెట్రో పిల్లర్.. తల్లీ కుమారుడి మృతి..

బెంగళూరులో ఘోరం జరిగింది. మెట్రో పిల్లర్ కూలిపోవడంతో బైక్ ప్రయాణిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనలో తల్లీ, రెండేళ్ల కుమారుడు చనిపోయాడు. 

Horror.. Metro pillar fell on a bike.. Mother and son died..
Author
First Published Jan 11, 2023, 6:59 AM IST

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. కదులుతున్న బైక్ పై ఓ మెట్రో పిల్లర్ కూలిపోయింది. దీంతో బైక్ పై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో తల్లి కుమారుడు మరణించారు. మిగితా వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. 

వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు సిటీలో లోహిత్ కుమార్, తేజస్విని అనే దంపతులు తమ రెండేళ్ల కవల పిల్లలైన విహాన్, విస్మితతో కలిసి జీవిస్తున్నారు. భార్త సివిల్ ఇంజనీర్ గా పని చేస్తుండగా.. భార్య ఓ మొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే పిల్లలను ప్లే స్కూల్ లో, భార్యను తన ఆఫీసులో దిగబెట్టేందుకు విహాన్ బైక్ పై బయలుదేరారు. హెచ్‌బీఆర్‌ లేఅవుట్‌ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోకి చేరుకోగానే నిర్మాణంలో ఉన్న నమ్మ మెట్రో పిల్లర్‌లోని రీన్‌ఫోర్స్‌మెంట్‌ కేజ్‌ బైక్ పై కూలిపోయింది. దీంతో నలుగురికి గాయాలు అయ్యాయి. 

దీనిని గమనించిన స్థానికులు వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి తేజస్విని, విహాన్ లు మరణించారు. ‘‘ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. మేము వారిని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించాం. కానీ అప్పటికే చాలా రక్త నష్టం జరిగింది. బీపీ త్వరగా పడిపోయింది.’’ అని డాక్టర్లు తెలిపారు.  మిగితా ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 

ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్తంభం ఎత్తు 40 అడుగులకు పైగా ఉందని, అనేక టన్నుల బరువు ఉంటుందని స్థానికులు పేర్కొననారు. ఈ ఘటనపై గోవిందపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్‌కు బాధ్యులైన బీఎంఆర్ సీఎల్ అధికారులు, కాంట్రాక్టర్లపై ఐపీసీ సెక్షన్లు 337, 338, 304a, 427 రీడ్ విత్ 34 కింద కేసు బుక్ చేశారు. ఘటనకు సంబంధించి లోహిత్ కుమార్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు సేకరించారు.

ఈ ఘటనపై ధార్వాడ్‌లో సీఎం బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపి మృతులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘‘ నాకు ఇప్పుడే తెలిసింది. విచారణ చేసి.. పిల్లర్ కూలడానికి గల కారణాలను గుర్తించి పరిహారం అందజేస్తాం’’ అని తెలిపారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. బాధితులు హెల్మెట్ ధరించారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదని, కుప్పకూలడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు.

మెట్రో పిల్లర్ కూలిపోవడంతో లోహపు కడ్డీలను తొలగించే క్రమంలో కళ్యాణ్ నగర్ నుంచి హెబ్బాల్ వరకు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదం జరిగిన దాదాపు నాలుగు గంటల తర్వాత బీఎంఆర్ సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) అంజుమ్ పర్వేజ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం కూడా ప్రకటించారు.

‘‘ ఇలాంటి నిర్మాణాలు జరిగేటప్పుడు నాలుగు వైపులా ఇనుప తాడులు కట్టి ఉంటాయి. అయితే ఈ ఘటన సమయంలో ఓ తాడు తెగిపోయింది. దీనికి కారణాన్ని తెలుసుకునేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి నిపుణులను పిలుస్తున్నాను. ఏదైనా మాన్యువల్ తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు ” అని పర్వేజ్ అన్నారు. ‘‘ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి నిర్మాణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేము పునఃపరిశీలిస్తాం. బాధిత కుటుంబానికి అవసరమైన ఏ సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios