హుగ్లీ హింసాకాండ ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ మాట్లాడుతూ..  ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడం సాధ్యం కాదని, ఆందోళనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

శ్రీరామ నవమి రోజున పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో తీవ్రహింస చెలరేగింది. షిబ్‌పూర్, కాజీపారా ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపుపై రాళ్లదాడి జరిగింది. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హింసాత్మక ఘటనపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.

హింసాకాండ ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించేందుకు రాజ్‌భవన్‌లో తొలిసారిగా ప్రత్యేక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి, బాధ్యులపై సమర్థవంతమైన పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. భయపడకుండా న్యాయమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

సిలిగురి పర్యటనకు వచ్చిన గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల విధులను మరోసారి గుర్తు చేస్తూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమే ప్రధానమని గవర్నర్ అన్నారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసులు బాధ్యతాయుతంగా సత్వర, న్యాయమైన చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా, పౌరుల భద్రత గురించి గవర్నర్ పదేపదే పోలీసులకు గుర్తు చేశారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని పోలీసులకు సూచించారు.

ఘటనా స్థలానికి భద్రతా బలగాలు చేరుకున్నాయనీ,దోషులను ఈ రాత్రికే కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టడం జరుగుతుందని గవర్నర్ సివి ఆనంద బోస్ తెలిపారు. ఇలాంటి గూండాయిజం ప్రజాస్వామ్య ప్రక్రియలను అడ్డుకుంటుందని ఆయన అన్నారు. గూండాలను, దుండగులను ఉక్కుపాదాలతో అణిచి వేస్తామని అన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

అంతకుముందు.. గురువారం , శుక్రవారం మధ్యాహ్నం హింసాత్మక సంఘటనలు జరిగాయి. గవర్నర్ అదే రోజు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌కె ద్వివేది, హోం శాఖ కార్యదర్శి బిపి గోపాలిక హింసాత్మక ప్రాంతాల పరిస్థితిపై వివరణాత్మక నివేదికను తీసుకున్నారు.ప్రత్యేక మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

హింసాత్మక ప్రాంతాలను పర్యవేక్షించేందుకు రాజ్‌భవన్‌లో తొలిసారిగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రశ్నించింది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అంతకుముందు రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.