ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ యువకుడి హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. దాన్ని పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. 20 ఏళ్ల యువకుడిని గొంతు నులిమి హత్య చేసి ఆ తర్వాత చెట్టుకు వేలాడదీశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 

కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ అతను ఓ యువతితో తన ప్రేమాయణాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. దాంతో అతన్ని చంపేసి చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. బాలిక సోదరుడిని, అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. మూడో నిందితుడైన బాలిక తండ్రి పరారీలో ఉన్నాడు. 

బాలికతో సంబంధం కొనసాగించిన శుభం హత్యలో ఆ ముగ్గురు నిందితులని డిప్యూటీసీ పోలీసు సూపరింటిండెంట్ గిరిజా శంకర్ త్రిపాఠీ చెప్పారు. బాలిక సోదరుడు, అతని మిత్రుడు నేరాన్ని అంగీరించినట్లు పోలీసులు తెలిపారు. 

శుభం మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండడాన్ని ఆగస్టు 16వ తేదీన పోలీసులు గుర్తించారు. అతన్ని హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించారు.