చెన్నై: తమిళనాడులో పరువు హత్య జరిగింది. తన కూతురిని ఓ వ్యక్తి హత్య చేసి బాత్రూంలో పడిపోయి మరణించిందని డ్రామా ఆడాడు. అయితే, గుట్టు రట్టుకావడంతో అతను కటకటాల వెనక్కి వెళ్లక తప్పలేదు. ఈ సంఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో చోటు చేసుకుంది.

కాంచీపురం జిల్లా ఉత్తర మేరకు చెందిన బాలాజీ కూతరు సెంతారకై రెండు రోజుల క్రితం బాత్రూంలో శవమై కనిపించింది. బాత్రూంలో జారిపడి మరణించినట్లు కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. అయితే పోలీసులు అనుమానించి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు జరిపారు. 

అయితే, సెంతారకై స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది. ప్రియుడితో కలిసి తిరుగుతున్న కూతురిని తండ్రి బాలాజీ చూషశాడు. ఆ యువకుడితో పెళ్లి చేయడం ఇష్టం లేక, మరొకరిని చూసి బాలాజీ కూతురికి వివాహం చేశాడు. అయితే, పెళ్లి జరుగినప్పటికీ సెంతారకై అత్తారంటికి వెళ్లనని మొండికేసింది. 

ఆమెను అత్తారింటికి పంపించడానికి బాలాజీతో పాటు కుటుంబ సభ్యులు తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాలేదు. ఆమె ప్రియుడితో పారిపోతుండవచ్చునని బాలాజీ అనుమానించాడు. దాంతో గొంతు నులిమి కూతురిని చంపేశాడు. బాత్రూంలో జారిపడి మరణించినట్లు ఆ తర్వాత నాటకమాడాడు. బాలాజీని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేసి మధురాంతకం సబ్ జైలుకు పంపించారు.