బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకుంది. దళిత యువకుడిని ప్రేమించినందుకు ఓ వ్యక్తి తన కూతురిని దారుణంగా హత్య చేశాడు. బండరాయితో మోది ఆమెను చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని రామనగరలోని కుడూరులో జరిగింది.

వృత్తి రీత్యా రైతు అయిన 48 ఏళ్ల యువతి తండ్రిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. 18 ఏళ్ల హేమలత మృతదేహాన్ని మగదిలోని మామిడి తోటలో పడి ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన రైతు కృష్ణప్ప తన కూతురు దళిత సామాజిక వర్గానికి చెందిన పునీత్ తో సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడని పోలీసులు చెప్పారు. బీకాం చదువుతున్న తన కూతురు హేమలత కనిపించడం లేదని కృష్ణప్ప కూడూరు పోలీసులకు అక్టోబర్ 9వ తేదీన ఫిర్యాదు చేశాడు. 

తాను పొలానికి వెళ్లి సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో తన కూతురు కనిపించలేదని అతను ఫిర్యాదులో తెలిపాడు. గత కొన్ని వారాలుగా పునీత్ అనే వ్యక్తి తరుచుగా తన కూతురితో మాట్లాడుతున్నాడని అతను చెప్పాడు. తన కూతురి అదృశ్యంలో పునీత్ హస్తం ఉందని ఆరోపించాడు. 

కూడూరులో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న పునీత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పునీత్ ను పలుమార్లు విచారించిన తర్వాత ఇందులో నాటకం ఉందని గ్రహించినట్లు వారు తెలిపారు. కాలేజీలో చదువుతున్నప్పటి తానూ హేమలత ప్రేమించుకుంటున్నట్లు పునీత్ పోలీసులకు చెప్పాడు. హేమలత అదృశ్యం వెనక పునీత్ హస్తం లేదని పోలీసులు నిర్దారించకున్నారు. 

పునీత్ తో ఆమె సంబంధాన్ని తెంచడానికి కృష్ణప్ప ప్రయత్నించాడని, పునీత్ తో తెగదెంపులు చేసుకోవాలని చెప్పాల్సిందిగా కృష్ణప్ప తమ సమీప బంధువు యోగికి చెప్పాడని పోలీసులు వివరించారు. హేమలత అదృశ్యంపై అనుమానం వచ్చి పోలీసులు కృష్ణప్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

కృష్ణప్ప విచారణలో మాట మారుస్తూ వచ్చాడు. తాను, తన మేనల్లుడు కలిసి ఆమెను చంపినట్లు మొదట చెప్పాడు. మామిడి తోటలో మొక్కలు నాటడానికి తవ్వకం జరిపినప్పుడు ఆమె మృతదేహం కనిపించిందని మరోసారి చెప్పాడు. యోగిని, ఓ మైనర్ బాలుడిని కూడా ప్రశ్నించంగా వారు ముగ్గురు కలిసి హేమలతను చంపినట్లు తేలింది.