తమకిష్టంలేని వ్యక్తిని ప్రేమించిందని ఓ యువతిని కుటుంబసభ్యులు హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. హత్య చేసి, బియ్యం బస్తాలో కుక్కి.. నదిలో పడేయడం కలకలం రేపింది.
ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 20 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బియ్యం బస్తాలో కుక్కారు. ఆ బస్తాను నదిలో పడేశారు. అయితే, ఆమె మృతదేహం నది ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో ఘటన వెలుగు చూసింది. ఇది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. యువతి ఒక యువకుడితో ప్రేమలో ఉందని ఆ వ్యవహారం నచ్చకే కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మృతురాలైన యువతి మేనమామ, తండ్రి, సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని ఖుషి నగర్ జిల్లాలోని బూఢీ గంఢక్ నదిని ఆనుకుని నర్వాజ్యోత్ డ్యామ్ ను నిర్మించారు. కాగా.. ఈ డ్యాముకు దగ్గరలో ఓ యువతి మృతదేహం దొరికింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో ఆ యువతి గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది.
దీంతో పరువు హత్యగా అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.యువతి తండ్రి, సోదరుడు, మేనమామలతో పాటు.. చనిపోయిన యువతి కుటుంబంలోని మహిళలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని.. తీవ్రతను బట్టి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఉత్తరప్రదేశ్లోని ఖుషి నగర్ జిల్లా ఎస్పీ రితేష్ కుమార్ సింగ్ తెలిపారు.
ఇదిలా ఉండగా, బీహార్ లో నిరుడు డిసెంబర్ లో ఇలాంటి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బీహార్లోని నలందలో తన చెల్లెలు తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించిందని ఆ వ్యక్తిని చంపేశాడు ఓ అన్న. ఈ పరువు హత్య కలకలం రేపింది. చంపేయడంతో అతడు కసి తీరలేదు. చంపేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. తరువాత వాటిని కుక్కలకు ఆహారంగా వేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… డిసెంబర్ 16వ తేదీన బిట్టు కుమార్ అనే యువకుడు ఇంట్లో నుంచి బయటికెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో తెల్లారి వస్తాడులే అనుకున్నారు.
అప్పటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కుమార్ కోసం అంతటా వెదికారు. తెలిసిన వారందరినీ అడిగారు. కానీ బిట్టూ కుమార్ ఆచూకీ తెలియలేదు. దీంతో డిసెంబర్ 18వ తేదీన వారు పోలీసులను ఆశ్రయించారు. బిట్టూ కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా వారికి రాహుల్ అనే వ్యక్తి పై అనుమానం వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ ని విచారించడంతో భాగంగా అతడిని తనిఖీ చేయగా.. అదృశ్యమైన బిట్టూ కుమార్ ఫోన్ అతడి దగ్గర ఉంది. ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత రాహుల్ మీద అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో రాహుల్ నేరాన్ని అంగీకరించాడు. బిట్టూ కుమార్ తో తన సోదరి సన్నిహితంగా ఉందని.. అది చూసి తట్టుకోలేకపోయాను అని చెప్పుకొచ్చాడు. అందుకే డిసెంబర్ 16వ తేదీన ఏదో సాకుతో బిట్టూ కుమార్ ను నిర్మానుష్య ప్రదేశానికి వచ్చేలా చేశానని.. అక్కడే ప్రాణాలు తీశానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. చంపేసిన తరువాత బిట్టూ కుమార్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారంగా వేశానని చెప్పారు. మిగతా శరీరభాగాలను నదిలో పడేశానని చెప్పుకొచ్చాడు.
