డబ్బున్న మహారాజులను వెతకడం... వాళ్ల వీక్ పాయింట్ తో అమ్మాయిలను ఎరగా వేయడం... ఆ తర్వాత వారిని బెదిరించో, బ్లాక్ మెయిల్ చేసో.. డబ్బులు గుంజేసి కోట్లు దోచేశారు. ఇలాంటి ఐదు ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ హనీట్రాప్ ముఠా... 25 ఏళ్ల విదేశీ మహిళను ఓ ప్రముఖ డాక్టరు వద్దకు చికిత్స పేరిట పంపింది. సదరు విదేశీ మహిళ డాక్టరుతో స్నేహంగా ఉంటూ చికిత్స చేయించుకునేది. ఓ రోజు తనకు అనారోగ్యంగా ఉందని, తన అపార్టుమెంటుకు అత్యవసరంగా రమ్మని డాక్టరును కోరింది. ఆయన రాగానే ఆ మహిళ డాక్టరుతో పడకగదిలో గడిపి, దాన్ని రహస్య కెమెరాతో చిత్రీకరించి, బ్లాక్ మెయిల్ చేసి రూ.20 లక్షలు వసూలు చేసింది.
 
ఇదే కాన్సెప్ట్ తో కేవలం ఒక్క డాక్టర్ నే కాకుండా న్యాయవాదులు, వ్యాపారులు, హోటల్ యజమానేలు, రియల్ ఎస్టేట్ డీలర్స్, ట్రావెల్ ఏంజెంట్స్ ఇలా అందరినీ గుప్పట్లోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.లక్షలు కాజేశారు.  అమ్మాయిల వలపు వలలో చిక్కి తాము మోసపోయామని చెప్పి 8 మంది ప్రముఖులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రముఖ బాధితుల పేర్లను రహస్యంగా ఉంచామని, జహంగీర్ హనీ ట్రాప్ ముఠా రూ.2కోట్లు వసూలు చేసిందని, ముఠా నాయకుడు జహంగీర్ అలియాస్ షేక్ పరారీలో ఉన్నాడని, ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశామని ఢిల్లీ స్పెషల్ పోలీసు విభాగం డీసీపీ చెప్పారు.  
 
ఇలా దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జహంగీర్ గ్యాంగ్, మిట్టూ ముఠా, పర్మిందర్, రోహిత్ హనీట్రాప్ గ్యాంగ్, ముకేష్ ముఠాలు పలువురు ప్రముఖులపై వలపు వల విసిరి, పడకగది వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేశాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.