కోల్‌కతా: బెంగాల్ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడి ఘటన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాఖకు రాష్ట్ర గవర్నర్ జగదీప్ దంఖర్ శుక్రవారం నాడు నివేదిక సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమన్లు జారీ చేసింది.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న అంశంపై చర్చించేందుకుగాను ఈ నెల 14వ తేదీన కేంద్ర హోంమంత్రిత్వశాఖ పిలిచిందని కేంద్ర హోంమంత్రివర్గాలు చెప్పాయి.

కేంద్ర హోంమంత్రిత్వశాఖ కూడ బెంగాల్ లో జేపీ నడ్డాపై దాడి ఘటన తర్వాత బెంగాల్ ప్రభుత్వం నుండి నివేదిక కోరింది. డైమండ్ హర్బర్ లో జేపీ నడ్డా కాన్వాయ్ పై  ఈ నెల 10వ తేదీన దాడి జరిగింది.

టీఎంసీ వర్గాలే ఈ దాడికి పాల్పడినట్టుగా బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ, 20 తేదీల్లో అమిత్ షా బెంగాల్ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది.ఆరు మాసాల్లో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దాడిలో తమ పార్టీ ప్రమేయం ఉందని బీజేపీ ఆరోపణలను సీఎం మమత బెనర్జీ ఖండించారు. 

టీఎంసీ పాలనలో దౌర్జన్యం, అరాచకంతో చీకటి యుగంలోకి దిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. బెంగాల్ లో రాజకీయ హింసను సంస్ధాగతీకరించేందుకు తీసుకొచ్చిన విధానం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు.ట్విట్టర్ వేదికగా  అమిత్ షా బెంగాల్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.