పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రామనవమి సందర్భంగా బెంగాల్ లో జరిగిన  అల్లర్లు, హింసాత్మక ఘటనలపై నివేదిక ఇవ్వాలని మమతా ప్రభుత్వాన్ని హోంమంత్రి అమిత్ షా కోరారు. మొత్తం ఈ ఘటనపై మూడు రోజుల్లోగా నివేదిక అందించాలని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీని హోం మంత్రిత్వ శాఖ కోరింది.

పశ్చిమ బెంగాల్‌లో రామ నవమి నాడు జరిగిన హింసాకాండపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి),భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య పోరు తీవ్రమైంది. హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆధారాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రామనవమి సందర్భంగా బెంగాల్ లో జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై నివేదిక ఇవ్వాలని మమతా ప్రభుత్వాన్ని హోంమంత్రి అమిత్ షా కోరారు. మొత్తం ఈ ఘటనపై మూడు రోజుల్లోగా నివేదిక అందించాలని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీని హోం మంత్రిత్వ శాఖ కోరింది.

అంతకుముందు బెంగాల్‌లో హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని హోం మంత్రి అమిత్ షాకు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ లేఖ రాశారు. అంతకుముందు గురువారం నాడు రాష్ట్ర బిజెపి చీఫ్ సుకాంత్ మజుందార్‌తో హోంమంత్రి అమిత్ షా బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ భేటీ అయ్యారు. గురువారం హౌరాలో రామనవమి ఊరేగింపులో రెండు గ్రూపుల మధ్య ఘర్షణల తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతలను అంచనా వేశారు. 

హౌరా, హుగ్లీలో హింసాత్మక ఘటనలు

శ్రీరామ నవమి నాడు హౌరాలో మూక దాడి చేయడం, వాహనాలను తగలబెట్టడం, రాళ్లు రువ్వడం, దుకాణాలను ధ్వంసం వంటి హింసాత్మాక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు.అయినా.. అల్లర్లను అదుపు చేయలేకపోయారు. పలు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. హౌరా తర్వాత హుగ్లీలో ఆదివారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

సెక్షన్-144ను ఉల్లంఘించలేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ విలేకరులతో మాట్లాడుతూ.. “మేము 144 సెక్షన్‌ను ఉల్లంఘించలేదు. కనీసం మా పార్టీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహ్తో , నన్ను అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులను అభ్యర్థించాము. పోలీసులు నాకు అనుమతి ఇవ్వాలనుకోవడం లేదు, ఎందుకంటే వారు నిజాన్ని దాచాలనుకుంటున్నారు." జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణతో పాటు హింసాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలను వెంటనే మోహరించాలని మజుందార్ డిమాండ్ చేశారు.

పరిస్థితిని అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, తనను బటాలా వద్ద నిరసనకు అనుమతించకపోతే, ఆ స్థలంలో తాను ఆందోళన ప్రారంభిస్తానని ఆయన ఆరోపించారు. అంతకుముందు, నిషేధాజ్ఞలను ఉటంకిస్తూ పోలీసులు హుగ్లీ జిల్లాలోని హింసాకాండ బాధిత రిస్దా ప్రాంతాన్ని సందర్శించకుండా సోమవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నిలిపివేశారు.

ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ వివరణ 

మజుందార్ ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. బీజేపీ ఇబ్బందులు సృష్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మత సామరస్యానికి, శాంతికి విఘాతం కలిగించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని కునాల్ ఘోష్ అన్నారు. పోలీసులు శాంతిభద్రతలను నెలకొల్పినప్పుడు బిజెపి ఎందుకు రచ్చ సృష్టిస్తోంది? అని ప్రశ్నించారు. శాంతి భద్రతలను పణంగా పెట్టి ఓట్లు దండుకోవాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. 

శాంతిభద్రతలకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌తో కూడా హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడారు. ఈ రెండు పరిణామాల తర్వాత బీహార్ తరహాలో పశ్చిమ బెంగాల్ లోనూ కేంద్ర బలగాల మోహరింపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దళాలు హింసాత్మక ప్రాంతాలకు వెళ్లి రాష్ట్ర పోలీసులకు సహాయం చేస్తాయి. తాజా హింసాత్మక ఘటనలకు సంబంధించి మమత ప్రభుత్వం నుంచి హోం మంత్రిత్వ శాఖ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనలకు సంబంధించి హైకోర్టు ఇప్పటికే టీఎంసీ ప్రభుత్వాన్ని మందలిస్తూ నివేదికను కోరింది.