జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీఆర్‌పీఎఫ్‌ల ప్రస్తావన చేశారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వీరి అవసరం ఎక్కువ అని, దేశ అంతర్గత భద్రత వీరితోనే సాధ్యం అని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్ లేకున్నా శాంతియుత పరిస్థితులు నెలకొనే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జమ్ము: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల జమ్ము పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ రోజు జమ్ములో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, దేశ అంతర్గత భద్రతకు దోహదపడుతున్నాయని వివరించారు. ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కానీ, రానున్న సంవత్సరాల్లో ఈ ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్ అవసరాలు ఉండవని, శాంతియుత పరిస్థితులే నెలకొని ఉంటాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. అయితే, భావి కార్యక్రమాల కోసం అందరూ సిద్ధం కావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఆయన జమ్ములోని ఎంఏ స్టేడియంలో 83వ సీఆర్‌పీఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో మాట్లాడారు.
దేశంలో అంతర్గత భద్రతను కాపాడటానికి సీఆర్‌పీఎఫ్ అనివార్యమైన శక్తిగా ఉన్నదని అమిత్ షా చెప్పారు. వారి ద్వారానే పారదర్శక రీతిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం అవుతున్నదని, ప్రజాస్వామ్య సారం అమలు జరుగుతున్నదని పేర్కొన్నారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే సీఆర్‌పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నియంత్రించడం, వాటిని నిలువరించడం చేస్తాయని అన్నారు. అయితే, అల్లర్లు ముగిసిన తర్వాత సామాన్య పౌరుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, దైర్యం నింపడానికి వీరే దోహదపడుతారని, సీఆర్ఎపీఎఫ్ బలగాలు ప్రాణ రక్షకులుగా కనిపిస్తారని తెలిపారు.
ఇదే సందర్భంలో ఆయన జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పై ప్రశంసలు కురిపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌లో ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ జరుగుతున్నదని తెలిపారు. ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌కు సుమారు 33 వేల ఎన్నికైన పంచ్‌లు, సర్పంచ్‌లను అందించిందని అన్నారు. వీరు క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం అమలు కావడానికి దోహదపడుతున్నారని పేర్కొన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేషన్ కింద 21 హైడల్ ప్రాజెక్టులు వచ్చాయని, భారీగా రోడ్డు సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. జమ్ము కశ్మీర్‌లో ఇలా అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని చెప్పారు. అంతేకాదు, జమ్ము కశ్మీర్‌లో అవినీతి అంతానికి యుద్ధం ప్రారంభమైందని అన్నారు. వంద శాతం నీటి కుళాయిల ద్వారా నీరు అందించడం, విద్యుత్‌లో సంస్కరణలు లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలోనే వచ్చాయని వివరించారు.
అంతేకాదు, ఆర్టికల్ 370, 35ఏ ఎత్తేయడం గురించీ ఆయన మాట్లాడారు. ఈ రెండు ఆర్టికల్‌లను తొలగించడం మూలంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ ప్రేమ్ నాథ్ డోగ్రాల కలలు సాకారం అయ్యాయని తెలిపారు. ఏక్ నిషాన్, ఏక్ ప్రధాన్, ఏక్ విధాన్ అనే వారి కలలు నిజం అయ్యాయని వివరించారు. అంతేకాదు, ఈ ఆర్టికలను తొలగించడం వల్ల అణగారిన వర్గాలు, మహిళలు, పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, గూర్ఖా, వాల్మికీ కమ్యూనిటీలపైనా వివక్ష తొలిగిందని పేర్కొన్నారు.
